Begin typing your search above and press return to search.

పుడుతూనే సంచలనంగా మారాడు!

By:  Tupaki Desk   |   9 May 2020 4:30 AM GMT
పుడుతూనే సంచలనంగా మారాడు!
X
ముట్టుకుంటే మటాషే అన్నట్లుగా మారిపోయిన రోజులివి. మనిషి.. మనిషికి మధ్య దూరం తప్పనిసరిగా చేసిన మాయదారి రోజుల్లో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు మరో ఘనత సాధించారు. నిజానికి సర్కారీ వైద్యులన్న అపప్రదను పోగొట్టటమే కాదు..కార్పొరేట్ ఆసుపత్రులకు ఏ మాత్రం తగ్గని వైద్యాన్ని అందిస్తూ అభినందనలు పొందుతుననారు. ఇదిలా ఉంటే.. దేశంలో మరెక్కడా లేని రీతిలో చేసిన డెలివరీ ఇప్పుడు సంచలనంగా మారింది.

ప్రపంచాన్ని ఆగమాగం చేస్తున్న మాయదారి రోగంతో ఉన్న నిండు గర్భిణిలో మనోధైర్యాన్ని నింపటమే కాదు.. అత్యంత అపాయకరమైన పరిస్థితుల్లో డెలివరీ చేసేందుకు ముందుకొచ్చారు గాంధీ వైద్యులు. నిండు చూలాలికి ప్రత్యేక జాగ్రత్తలు చెప్పి.. తాము తీసుకుంటూ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన వైద్యులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

తాజా డెలివరీ దేశ వ్యాప్తంగా అందరి చూపు గాంధీ మీద పడేలా చేసింది. ప్రస్తుతం తల్లి.. బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. పుడుతూనే సంచలనంగా మారిన ఈ పిల్లాడి న్యూస్ ఇప్పుడో హాట్ టాపిక్ గా మారింది. పుట్టిన పిల్లాడికి మాయదారి జబ్బు సోకిందో లేదో? అన్న విషయాన్ని ఇంకా తేల్చాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తాజాగా స్పందించారు.

ట్విట్టర్ లో ట్వీట్ చేసిన ఆయన.. గాంధీ వైద్యుల్ని తెగ పొగిడేశారు. ప్రత్యేక జాగ్రత్తలతో డెలివరీ చేసిన గాంధీ వైద్యుల్ని పొగిడేశారు. కనిపించే దైవాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తల్లి.. బిడ్డలు ఇద్దరూ త్వరలోనే గాంధీ నుంచి డిశ్చార్జ్ అయి.. క్షేమంగా ఇంటికి చేరాలని కోరారు. హరీశ్ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.