Begin typing your search above and press return to search.

ఏపీలో మ‌రో ఏడు...పెరుగుతూనే పోతున్న పాజిటివ్ కేసులు

By:  Tupaki Desk   |   13 April 2020 10:30 PM IST
ఏపీలో మ‌రో ఏడు...పెరుగుతూనే పోతున్న పాజిటివ్ కేసులు
X
పాజిటివ్ ఎల్ల‌ప్పుడూ మంచికే కాదు క‌దా? ఇప్పుడైతే స‌రిగ్గా అదే సంద‌ర్భం. ఎందుకంటే... క‌రోనా పాజిటివ్ క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఈ మ‌హ‌మ్మారి క‌ల‌క‌లం మ‌న తెలుగు రాష్ట్రాల్లోనూ త‌న పాగా వేస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఏపీలో ఈరోజు కొత్తగా 7 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 439 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్ర‌జ‌ల్లో క‌ల‌వ‌రం పెరుగుతోంది.

కరోనా కేసుల్లో గుంటూరు జిల్లా అగ్రస్థానంలో ఉంది. కరోనా నియంత్రణ చర్యలపై సమీక్షించిన సీఎం జగన్..ఏపీలో కుటుంబ సర్వే ద్వారా వ్యాధి లక్షణాలున్న అందరికీ కరోనా టెస్టులు చేయాలని ఆదేశించారు. ఎయిమ్స్ డాక్టర్లతో మాట్లాడి అత్యుత్తమ చికిత్స పద్ధతులు అందుబాటులోకి తేవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. పేషెంట్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా విదేశాల్లో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. అనంతపురం, ప్రకాశం, నెల్లూరులో కరోనా పేషెంట్ల కోసం 400 బెడ్లు అందుబాటులోకి తీసుకురావాలని, రోజుకు పదివేల పీపీఈలతో పాటు అవసరమైన ఎన్ 95 మాస్కులు.. లోకల్‌గానే తయారయ్యేలా చూడాలని జగన్‌ సూచించారు.

మ‌రోవైపు, తెలంగాణను కరోనా వైరస్ కలవరపెడుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు 563 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 32 పాజిటివ్ కేసులు వచ్చాయి. కరోనా కారణంగా రాష్ట్రంలో 17 మంది చనిపోయారు. కరోనా నియంత్రణ చర్యలపై సమీక్ష జరిపిన తెలంగాణ సీఎం కేసీఆర్.. కేసులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.