Begin typing your search above and press return to search.

కరోనాతో కంటి నిండా కునుకు లేని ఆ రాష్ట్రానికి నిపా షాక్

By:  Tupaki Desk   |   6 Sep 2021 3:02 AM GMT
కరోనాతో కంటి నిండా కునుకు లేని ఆ రాష్ట్రానికి నిపా షాక్
X
మాయదారి మహమ్మారి కరోనా రేపిన రచ్చతో కేరళ రాష్ట్రం కిందా మీదా పడుతోంది. గడిచిన కొద్దిరోజులుగా దేశం మొత్తమ్మీదా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో.. 70 శాతం కేసులు కేవలం కేరళ నుంచి కావటం చూస్తే.. ఆ రాష్ట్రంలో వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. కొద్ది రోజులుగా కేరళలో రోజుకు 30వేల కేసులు నమోదవుతున్న పరిస్థితి. దీంతో.. తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. దేశం మొత్తాన్ని కరోనా ఊపేసిన వేళలో.. కేరళలో పరిమిత సంఖ్యలో కేసులు నమోదు కాగా.. తాజాగా అందుకు భిన్నంగా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోయి..ఆ రాష్ట్రానని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

కరోనాతో కిందా మీదా పడుతున్న ఆ రాష్ట్రానికి ఇప్పుడు మరో ప్రమాదకరమైన నిపా వైరస్ కలకలం మొదలైంది రాష్ట్రంలోని కోజికోడ్ లో నిపా వైరస్ బారిన పడిన 12 ఏళ్ల బాలుడు మరణించటంతో రాష్ట్ర ప్రభుత్వం అలెర్టు అయ్యింది. తీవ్రమైన జ్వరంతో మావోర్ కు చెందిన బాలుడ్ని కోజికోడ్ లోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. శనివారం రాత్రి అతని ఆరోగ్యం విషమించగా.. ఆదివారం ఉదయం మరణించినట్లుగా రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

రాష్ట్రంలో నిపా వైరస్ నిర్దారణ అయినట్లు తేలటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కాగా.. కేంద్రం కూడా స్పందించింది. హుటాహుటిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కు చెందిన ప్రత్యేక టీంను రాష్ట్రానికి పంపింది. నిపా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా కేరళ సర్కారు 16 టీంలను ఏర్పాటు చేసింది. గడిచిన రెండు వారాలుగా మరణించిన బాలుడితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి.. వారందరిని వేరుగా ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందుకోసం కోజికోడ్ మెడికల్ కాలేజీలో ఒక వార్డును ప్రత్యేకంగా నిపా వార్డుగా మార్చారు. మరణించిన బాలుడితో కాంటాక్టు ఉన్న వారు మొత్తం 188 మందిగా గుర్తించారు. వారిలో 20 మందికి తీవ్రమైన ముప్పు ఉందని గుర్తించారు. ఇద్దరు ఆరోగ్య సిబ్బందిలో నిపా వైరస్ లక్షణాలు కనిపించినట్లుగా గుర్తించారు. ఈ 20 మందిని కోజికోడ్ వైద్య కళాశాలలోని ప్రత్యేక వార్డులో ఉంచి.. చికిత్స చేస్తున్నారు. దరిద్రం కాకుంటే కేరళకు వరుస కష్టాలు మీడ పడుతున్నాయి.

కొవిడ్ కేసులు సరిపోవన్నట్లు జులైలో జికా కేసులు బయటపకు రాగా.. తాజాగా నిపా వైరస్ కేసులు కూడా తోడు కావటంతో.. ఆ రాష్ట్రం కిందామీదా పడుతోంది. ఇంతకూ నిపా వైరస్ విషయానికి వస్తే.. పళ్లు తిని జీవించే గబ్బిలాల లాలాజలంతో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. పందులు.. కుక్కలు.. గుర్రాల నుంచి మనుషఉలకు సోకుతుంది. మనుషుల్లో ఈ వైరస్ ఎంట్రీ ఇచ్చిన 5-14 రోజుల మధ్య బయటపడుతుంది. ఆ సమయంలో సరైన చికిత్స లేని పక్షంలో పరిస్థితి ఆందోళనకరంగా మారి.. ప్రాణాల మీదకు తీసుకొస్తుంది.