Begin typing your search above and press return to search.
ఢిల్లీలో తెలుగు రిపోర్టర్లకు కరోనా కష్టాలు !
By: Tupaki Desk | 6 May 2020 8:30 AM GMTఢిల్లీలో తెలుగు రిపోర్టర్లకి కరోనా కష్టాలు మొదలైయ్యాయి. తెలుగు రిపోర్టర్లకి కరోనా నిర్దారణ కావడంతో వారి కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. ఇప్పటివరకు మొత్తం ముగ్గురు ఎలక్ట్రానిక్ మీడియా చానళ్ల ప్రతినిధులకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మొదట ఓ టీవీ రిపోర్టర్ కు కరోనా నిర్ధారణ కాగా, అతన్ని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కానీ తర్వాత వైరస్ నిర్ధారణ అయిన ఇద్దరికి చికిత్స అందించడానికి ఏ ఆస్పత్రిలోనూ బెడ్లు దొరకలేదు.
దీనిపై మొదట ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. ఢిల్లీ ప్రభుత్వమే ఇప్పుడు సంక్షోభంలో ఉంది. ఢిల్లీ సర్కార్ సంగతి పక్కన పెడితే ..తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. ఈ విషయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి తెలియడంతో.. ఆయన అధికారులతో మాట్లాడి.. వారికీ హర్యానా ఎయిమ్స్ లో బెడ్లు ఏర్పాటు చేయించారు. ప్రభుత్వాలు పట్టించుకోలేదన్న విషయం బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దీనిపై స్పందించింది. కేటీఆర్ ప్రత్యేకంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో మాట్లాడారు. జర్నలిస్టుల కోసం రూ. 12 లక్షలు విడుదల చేశారు. వైరస్ బారిన పడిన ముగ్గురు జర్నలిస్టులకు తక్షణ సాయంగా రూ. 75వేలు అందించాలని ఆదేశించారు.
అలాగే , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా సాయం చేశారు. ఆ తర్వాత ఈ ఘటన పై ఏపీ సర్కార్ కూడా స్పందించింది. తాము కూడా ఏపీ భవన్ అధికారులతో సంప్రదించామని.. ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో తెలుగు జర్నలిస్టులకు చికిత్స అందించేలా ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేయించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది. అయితే , ప్రభుత్వాలు చేసే ప్రకటనలకు.. చేయాల్సిన చేతలకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తూండటంతో వైరస్ సోకితే తమను పట్టించుకునేవారే ఉండరన్న భయంతో ఢిల్లీ తెలుగు జర్నలిస్టులు ఆందోళనకు గురవుతున్నారు. ఇద్దరు జర్నలిస్టులకు చికిత్సకు చేర్చుకోవడానికే ఉపరాష్ట్రపతి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. యాజమాన్యాలు మామూలుగానే అంతంతమాత్రం స్పందనతో ఉంటాయి. రిపోర్టర్లు కాబట్టి.. రాజకీయ నేతలు ఫేవర్ చేయాలి. కానీ , వారి నుండి కూడా సరైన స్పందన లేకపోవడంతో ఢిల్లీ లో ఉండే తెలుగు రిపోర్టర్లు ఆందోళన చెందుతున్నారు.