Begin typing your search above and press return to search.

కరోనా వారికి ఈజీగా ఎటాక్ అవుతుందట

By:  Tupaki Desk   |   27 July 2021 9:41 AM GMT
కరోనా వారికి ఈజీగా ఎటాక్ అవుతుందట
X
ప్రస్తుత రోజుల్లో ఏం తినాలన్నా, ఏం ముట్టుకోవాలన్నా జనాలు కరోనా కంగారుతో వణికిపోతున్నారు. ఇలా కరోనా భయంతో జీవితాలను దుర్భరంగా సాగిస్తున్నారు. అసలు కరోనా ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుందనే కారణాలు తెలియక చాలా మంది తలలు బాదుకుంటున్నారు. కానీ తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైన విషయాలు చూస్తే ఎవరైనా సరే షాక్ కు గురికాక తప్పదు. అలా భయానక నిజాలను ఆ పరిశోధన వెల్లడించింది. మనుషుల్లో ప్రధానంగా పోషకాహార లోపం చాలా మందిలో ఉంటుంది.

మనం తినే ఆహారంలోని పోషకాలు శరీరానికి సరిపోకపోవడమే పోషకాహార లోపం. ఇటువంటి లోపం ఉన్న వారు తొందరగా అంటు వ్యాధులకు గురవుతారనే విషయం అందరికీ తెలుసు. కానీ శాస్త్రవేత్తలు ఇలాంటి పోషకాహార లోపంతో బాధపడేవారి గుండెలవిసే వార్తను చెప్పారు. పోషకాహార లోపంతో బాధపడే వారిని  కరోనా తొందరగా ఎటాక్ చేస్తుందట. అంతే కాకుండా అలాంటి వారు మృత్యు ఒడిలోకి చేరేందుకు కూడా ఎక్కువ అవకాశం ఉందని శాస్త్రవేత్తలు షాకింగ్ నిజాలను బయటపెట్టారు.

అసలు పోషకాహారంతో కరోనా కు సంబంధం ఏంటని చాలా మంది ప్రశ్నిస్తారు. కానీ వీటి రెండింటి మధ్య సంబంధం ఉందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. పోషకాహారం మెండుగా తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉండడంతో పాటు మనపై దాడి చేసే రోగాలు వ్యాప్తి చేసే క్రిములను కూడా మన శరీరం ధీటుగా ఎదుర్కొంటుంది. కానీ పోషకాహార లోపంతో బాధపడేవారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలా తక్కువ రోగ నిరోధక శక్తి ఉండడం వలన కరోనా లాంటి మహమ్మారి భారిన ఈజీగా పడతామని వైద్యులు తెలుపుతున్నారు.

ఇందుకు వారు చేసిన పరిశోధనలు కూడా బలం చేకూరుస్తున్నాయి. పోషకాహార లోపంతో బాధపడుతున్న 18 నుంచి 78 ఏళ్ల వయసున్న వారు కరోనా కు ఈజీగా చిక్కుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా మందిలో పోషకాహార లోపం ప్రధాన సమస్యగా ఉంటుంది. అలా పోషకాహార లోపంతో బాధపడేవారు త్వరగా కరోనా భారిన పడతారట. అసలు పోషకాహార లోపంతో కరోనా వస్తుందని తెలియ జెప్పడం కోసం 8,604 మంది పిల్లలు, 94,495 మంది పెద్దలపై పరిశోధనలు చేశారు.

వీరిని కొన్ని నెలల పాటు పరిశోధించి అసలు పోషకాహార లోపంతో కరోనా ఎలా వస్తుందనేది పరిశోధనలో వెల్లడించారు. మన దేశంలో కూడా పోషకాహార లోపంతో అనేక మంది పిల్లలు చనిపోతున్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వెలువరించిన నివేదికలో స్పష్టం చేశాయి. మన దేశంలో 2017 లో పోషకాహార లోపంతో 5 సంవత్సరాల లోపు వారు 10.4 లక్షల మంది మరణించారు. అందరికీ ఆహారం అందించడంలో భారత్ విఫలమవుతోందని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 నివేదిక తేటతెల్లం చేసింది. ఎలాగైనా సరే దేశంలో పోషకాహార లోపాన్ని నివారించాలని స్పష్టం చేసింది. లేకుంటే కరోనా కంగారుతో అనేక ప్రమాదాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది.