Begin typing your search above and press return to search.

ఆలీబాబా అద్భుతం.. కొవిడ్ టెస్టు రిజల్ట్ కేవలం 20 సెకన్లే!

By:  Tupaki Desk   |   4 March 2020 5:04 AM GMT
ఆలీబాబా అద్భుతం.. కొవిడ్ టెస్టు రిజల్ట్ కేవలం 20 సెకన్లే!
X
ఏది ఏమైనా చైనా చైనానే బాసూ. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ కు క్రియేటర్ అయిన ఆ దేశం.. ఆ వైరస్ లెక్కను సెకన్లలో గుర్తించే అద్భుతమైన సాంకేతికతను తెర మీదకు తీసుకొచ్చింది. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న టెక్నాలజీ ప్రకారం కొవిడ్ వైరస్ ఉందా? లేదా? అన్నది తేలేందుకు రక్త పరీక్ష జరిపిన 24 గంటల తర్వాతే ఫలితం వస్తున్న పరిస్థితి. అందుకు భిన్నంగా కేవలం 20 సెకన్ల వ్యవధిలోనే రిజల్ట్ ను తెలిపే సరికొత్త సాంకేతికతను చైనాకు చెందిన ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజ సంస్థ ఆలీబాబా తెర మీదకు తీసుకొచ్చింది.

కొవిడ్ వైరస్ కారణంగా కాస్తంత జలుబు చేసినా.. దగ్గు.. తుమ్ములు వస్తున్నా వెంటనే ఆసుపత్రికి వచ్చేస్తున్నారు. దీంతో.. వారికి వైరస్ ఉందో? లేదో? అన్నది తేల్చటం కష్టంగా మారింది. వేలాది వస్తున్న వారికి వెనువెంటనే కొవిడ్ వైరస్ లెక్క తేల్చేసేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గుర్తించే సాంకేతికతను చైనాకు చెందిన ఆలీబాబా సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. ఆలీబాబా ఆధ్వర్యంలోని రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ డామో ఆకాడమీ ఈ సాంకేతికతను డెవలప్ చేసినట్లుగా చెబుతున్నారు.

సిటీ స్కాన్ ద్వారా కరోనా ఒంట్లో ఉందా? లేదా? అన్న విషయాన్ని అత్యంత వేగంగా ఇరవై సెకన్లలోనే రిజల్ట్ ఇచ్చేసే వ్యవస్థను సిద్ధం చేసినట్లుగా సమాచారం. ఈ పరీక్షా ఫలితాలు 96 శాతం కచ్ఛితత్వ్ంతో ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఐదు వేల మంది కరోనా బాధితుల డేటాతో ఈ ఏఐ మోడల్ కు శిక్షణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆలీబాబానే కాదు చైనాకు చెందిన పింగ్ ఆన్ అనే చైనా హెల్త్ కేర్ సంస్థ సైతం కరోనా వైరస్ ను ఇట్టే గుర్తించే పరికరాన్ని తయారు చేసినట్లుగా చెబుతున్నారు. తమ సంస్థ సిద్ధం చేసిన పరికరం కేవలం 15 సెకన్లలోనే కొవిడ్ కేసుల్ని గుర్తిస్తుందని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ వెల్లడించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకూ చైనా అంటే ఆమడ దూరాన జరిగే దేశాలు.. ఈ కొత్త పరికరాల కోసం మాత్రం చైనా ముందు బారులు తీరటం ఖాయమని చెప్పక తప్పదు.