Begin typing your search above and press return to search.

జెట్ స్పీడులా కరోనా కేసులు.. ఆంక్షలు తప్పవా?

By:  Tupaki Desk   |   8 Jan 2022 8:30 AM GMT
జెట్ స్పీడులా కరోనా కేసులు.. ఆంక్షలు తప్పవా?
X
సంక్రాంతి వరకూ థర్డ్ వేవ్ మొదలుకావచ్చని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ అన్నట్టే జరుగుతోంది. దేశంలో కరోనా కేసులు జెట్ స్పీడులా పెరుగుతున్నాయి. తాజాగా రోజువారీ కేసుల సంఖ్య లక్షన్నరకు చేరువైంది. రోజుకు ఇన్ని కేసులు నమోదు కావడంతో కొందరు నిపుణులు థర్డ్ వేవ్ వచ్చినట్టేనని కన్ఫమ్ చేస్తున్నారు. ఇప్పటికే తీవ్రత ఎక్కువగా ఉన్నా ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఆంక్షలు మొదలయ్యాయి.

ఇక విదేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలోనూ ముదురుతున్నాయి. ఇప్పటికే 3 వేల కేసులు దాటాయి.వైరస్ వ్యాప్తి 26 రాష్ట్రాలకు సోకడంతో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.మహారాష్ట్రలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నాయి. అక్కడ ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, 50 శాతం ఆక్యూపెన్సీతో బార్లు,పబ్బులు, సినిమా హాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు పెట్టనున్నారు.

ఢిల్లీలో వీకెండ్ లాక్ డౌన్ మొదలైంది. నిన్న రాత్రి 10 గంటల నుంచి మొదలైన లాక్ డౌన్ సోమవారం ఉదయం 5 గంటల వరకూ కొనసాగనుంది. ఈ టైంలో కేవలం నిత్యావసరాలు, అత్యవసర సేవల కోసం మాత్రమే అనుమతించబోతున్నారు.

ఇక జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, ఉత్తరప్రదేశ్, పంజాబ్ లో కూడా ఆంక్షలు అమలవుతున్నాయి.

మరోవైపు భారత ప్రభుత్వం కూడా ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. విదేశీయుల నుంచి వచ్చే వారిలో కరోనా/ఒమిక్రాన్ లక్షణాలు బయటపడుతుండడంతో యూరప్ దేశాలతోపాటు మరిన్ని దేశాలను ఎట్ రిస్క్ జాబితాలో చేర్చింది. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు విమానాశ్రయంలోనే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్ వస్తే ఐసోలేషన్ లోకి వెళ్లాలి. నెగెటివ్ వస్తే హోం క్వారంటైన్ లోకి వెళ్లాలి. వారం రోజుల తర్వాత తిరిగి పరీక్షలు చేసుకోవాలి. ఇక ప్రయాణానికి 3 రోజుల ముందే కరోనా నెగెటివ్ రిపోర్ట్ సమర్పించాలి.

ఇక పలు అధ్యయనాల ప్రకారం.. దేశంలో కరోనా కేసులు ఈ నెలలోనే గరిష్ట్ర స్థాయికి చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెలాఖరుకు లేదా ఫిబ్రవరి రెండో వారానికి కేసులు గరిష్ట్ర స్థాయికి చేరి మార్చి నుంచి తగ్గుముఖం పట్టవచ్చంటున్నారు.

భారత్ లో థర్డ్ వేవ్ వస్తే గరిష్టంగా రోజుకు 6 లక్షల నుంచి 8 లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు.