Begin typing your search above and press return to search.

కోవీషీల్డ్.. కోవాగ్జిన్.. స్పుత్నిక్ టీకాల్లో తేడా ఏంది?

By:  Tupaki Desk   |   13 April 2021 10:30 AM GMT
కోవీషీల్డ్.. కోవాగ్జిన్.. స్పుత్నిక్ టీకాల్లో తేడా ఏంది?
X
అన్ని టీకాలు ఒకేలాంటివి కావు. ఒక్కో వ్యాక్సిన్ ను ఒక్కో పద్దతిలో తయారు చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ల తయారీకి అనుసరించే మార్గాలు వేర్వేరుగా ఉంటాయి. కరోనా విషయానికే వస్తే.. ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా కంపెనీలు వ్యాక్సిన్లు తయారు చేసేందుకు భారీ ఎత్తున ప్రయోగాలు చేయటం తెలిసిందే. వ్యాక్సిన్ తయారీకి ఒక్కొక్కరు ఒక్కోలాంటి విధానాన్ని ఫాలో అవుతుంటారు.

ఉదాహరణకు ఫైజర్ మోడెర్నా కంపెనీలు ‘‘ఎంఆర్ఎన్ఏ’’ సాంకేతికతను వినియోగిస్తే.. భారత బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ ను ‘‘హోల్ విరియన్’’ విధానాన్ని అనుసరించారు. ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా, చైనాకు చెందిన క్యాన్‌సినో, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, రష్యా స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌లన్నీ.. ‘‘వెక్టర్’’ విధానాన్ని ఫాలో అయ్యారు. మరి.. ఈ మూడు విధానాల్లో ఉన్న తేడాలేమిటన్న విషయంలోకి వెళితే..

ఎంఆర్ఎన్ఏ విధానం

మన శరీరంలోని కణాలతోనే కరోనా స్పైక్ ప్రోటీన్ ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తాయి. ఫైజర్‌, మోడెర్నా కంపెనీలు ఇదే విధానాన్ని అనురించాయి.

హోల్ విరియన్ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ విధానం

భారత్ బయోటెక్ తాము తయారు చేసిన కొవాగ్జిన్ ను ఈ విధానంలోనే తయారు చేశారు. ఇందులో వైరస్ లోని స్పైక్ ప్రోటీన్ లాంటి ఏదో ఒక భాగాన్ని శరీరంలోకి పంపటం కాకుండా.. మొత్తం వైరస్ ను నిర్వీర్యం చేసి శరీరంలోకి పంపటం. పోలియోను నిర్మూలించింది కూడా ఈ తరహా విధానంలోనే.

వెక్టర్ వ్యాక్సిన్ విధానం

ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా, చైనాకు చెందిన క్యాన్‌సినో, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ తదితర టీకాలు ఇదే విధానాన్ని అనుసరించాయి. వేరే వైరస్ ను వాహకంగా చేసుకొని శరీరంలోకి కరోనా స్పైక్ ప్రోటీన్ ను పంపి.. కోవిడ్ ను అధిగమిస్తారు.

హెటెరోలోగస్ విధానం

రెండు వేర్వేరు వైరస్ లను వినియోగిస్తూ టీకాను తయారు చేస్తారు. ఈ టీకాలో తొలి డోస్ ను ఒక వైరస్ తో.. రెండో డోస్ ను మరో వైరస్ తో రూపొందిస్తారు. స్పుత్నిక్ వీ టీకా ఈ కోవలోకే చెందింది.