Begin typing your search above and press return to search.

ఓటు వేయని వారికి పథకాలు ఇవ్వొద్దు: సీపీ సజ్జనార్

By:  Tupaki Desk   |   1 Dec 2020 3:46 PM GMT
ఓటు వేయని వారికి పథకాలు ఇవ్వొద్దు: సీపీ సజ్జనార్
X
హైదరాబాద్ ఓటర్లు మళ్లీ ఇళ్లు దాటి కాలు బయటపెట్టలేదు. ఈసారి సైతం పోలింగ్ శాతం భారీగా తగ్గింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగంపై ఎంత అవగాహన కల్పించినా సరే హైదరాబాద్ ఓటరు మాత్రం స్పందించలేదు. ఓటు వేయలేదు.

గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడంపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ శాతం తగ్గడం బాధాకరమన్నారు. దీనిపై సమాజం ఆలోచించాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కేవలం 40 నుంచి 45శాతం మాత్రమే పోలింగ్ నమోదైందని.. కోట్లు ఖర్చు పెట్టి.. ప్రజల సొమ్ముతో ఎన్నికలు నిర్వహిస్తే నిష్ప్రయోజనంగా మారుతోందన్నారు.

ఓటు వేసిన వారికి ఓ రకంగా.. ఓటు వేయని వారికి మరో రకంగా ట్రీట్ చేయాలని సీపీ సజ్జనార్ సూచించారు. ఓటు వేసిన వారికి ప్రోత్సాహకాలు అందించాలన్నారు. స్పెషల్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. ఓటు వేసిన వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలన్నారు. ఓటు వేయని వారికి పథకాలు ఇవ్వకుండా నిబంధన తేవాలన్నారు. విద్యార్థులు సీట్లు పొందకుండా నిబంధన పెట్టాలన్నారు. జాబ్ అవకాశాలు కూడా ఈ వ్యత్యాసం చూపాలన్నారు.దీనిపై ఎన్నికల కమిషన్, యంత్రాంగం ఆలోచించాలని సూచించారు. రాజకీయపార్టీలు, సీనియర్ అధికారులతో కమిటీ వేసి ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

ఎన్నికల సందర్భంగా నగరంలో పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టామని.. పర్యటనలు చేశామని అయినా హైదరాబాద్ లో పోలింగ్ శాతం తగ్గడంపై సీపీ అసహనం వ్యక్తం చేశారు. యువత ఓట్లు వేయకపోవడం బాధాకరమన్నారు. ఐటీ సెక్టర్ వాళ్లు సెలవులు వస్తే వెళ్లిపోతున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి మీడియా ముందు చర్చల్లో మాట్లాడడానికి చదువుకున్న వాళ్లు ఆసక్తి చూపుతున్నారని విమర్శించారు.