Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ వేళ సజ్జన్నార్ వార్నింగ్ విన్నారా?

By:  Tupaki Desk   |   15 April 2020 4:30 AM GMT
లాక్ డౌన్ వేళ సజ్జన్నార్ వార్నింగ్ విన్నారా?
X
దిశ ఎపిసోడ్ తో దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జన్నార్. దిశ నిందితుల ఎన్ కౌంటర్ దేశీయంగానే కాదు అంతర్జాతీయంగానూ వార్తాంశంగా మారింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అమలుకు సంబంధించి తాజాగా ఆయనో ఆసక్తికర వార్నింగ్ ఇచ్చారు. లాక్ డౌన్ వేళ.. ఎంతో అవసరమైతే తప్పించి ప్రజలు బయటకు రాకూడదు. అందుకు భిన్నంగా.. వివిధ కారణాలు చెప్పి బయటకు వస్తున్న ప్రజల్ని కట్టడి చేసేందుకు మిగిలిన వారికి భిన్నమైన వార్నింగ్ ఇచ్చేశారు.

లాక్ డౌన్ వేళ అవసరం లేకున్నా బయటకు వచ్చే వారికి షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం అనవసర కారణాలతో బయటకు వచ్చే వారికి పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్ లో నిర్బంధించాలని నిర్ణయించారు. పదే పదే హెచ్చరిస్తున్నా.. లాక్ డౌన్ నిబంధనల్ని పట్టించుకోని వారిపై చర్యలకు సిద్ధమైనట్లుగా చెబుతున్నారు.

కరోనాను చాలామంది తేలిగ్గా తీసుకుంటున్నారని.. ఇంతటి మహమ్మారి విషయంలో అప్రమత్తతంగా ఉండాలన్నారు. లాక్ డౌన్ ను పాటించని వారిని క్వారంటైన్ కు తీసుకెళితే.. పద్నాలుగురోజుల పాటు బయటకు వచ్చే అవకాశం లేదన్నారు. అనవసరంగా బయటకు వచ్చే వారి విషయంలో కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఆయన చెప్పినట్లే.. అనవసరంగా వీధుల్లోకి వచ్చే వారికి పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్ కు తరలించే నిర్ణయాన్ని అమలు కానీ చేస్తే.. అదో సంచలనంగా మారటం ఖాయం.