Begin typing your search above and press return to search.

అతిపెద్ద ర‌చ్చ‌కు ఫుల్ స్టాప్ ప‌డ‌నుంది

By:  Tupaki Desk   |   20 Aug 2016 7:15 AM GMT
అతిపెద్ద ర‌చ్చ‌కు ఫుల్ స్టాప్ ప‌డ‌నుంది
X
అయోధ్య‌లో రామ‌మందిరం- మ‌సీదు అనే అంశం గురించి కొత్త‌గా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ అంశం దేశ‌వ్యాప్తంగా మ‌త విద్వేషాలు రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. సాధార‌ణంగా ఉత్తర్‌ ప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలు అన‌గానే మందిరం-మ‌సీదు వివాదం తెర‌మీద‌కు వ‌స్తుంది. అయితే త్వ‌ర‌లో ఎన్నిక‌లు ముంచుకొస్తున్న నేప‌థ్యంలో వివాదాస్పద రామ మందిర్ అంశానికి ఫుల్ స్టాప్ పడేలా క‌నిపిస్తోంది.

రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ పూనుకునేందుకు ఇదే సరైన సమయమని బీజేపీ నేతలు సెలవిస్తున్నారు. ఇటీవల అయోధ్యలో పర్యటించి వచ్చిన ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ డాక్టర్‌ సీపీ ఠాకూర్ మాట్లాడుతూ బీజేపీ అజెండాలో ఈ అంశం అగ్రభాగాన నిలుస్తుందని చెప్పారు. ఈ ఏడాది జులైలో మరణించిన బాబ్రీ మసీదు కేసులో కక్షిదారు హషీం అన్సారీ కుటుంబ సభ్యులను అయోధ్యలో ఠాకూర్‌ పరామర్శించారు. దశాబ్ధాల తరబడి నడుస్తున్న వివాదానికి రామ మందిరం - మసీదుల నిర్మాణమే ఆమోదయోగ్య పరిష్కారం అవుతుందని ఆయన సూచించారు. ప్రభుత్వం చొరవ చూపితే అయోధ్యలో రామ మందిరం - మసీదు నిర్మాణం జరుగుతుందని అన్నారు. అయోధ్య వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది కదా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ దీనిపై చర్చించేందుకు తాను ఈనెల 22న అటార్నీ జనరల్‌ ను కలుస్తానన్నారు. ఈ అంశంపై సత్వర పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించాలని అటార్నీ జనరల్‌ ను తాము కోరతామన్నారు.

మందిర్‌ వివాదం నేపథ్యంలో అయోధ్యలో భద్రతపై వెచ్చిస్తున్న వ్యయంతో ఈపాటికి రామ మందిరం - మసీదు నిర్మించి ఉండేవారమని ఠాకూర్ అన్నారు. గత 70 ఏండ్లుగా రామమందిర అంశాన్ని పరిష్కరించుకోలేకపోవడం విచారకరమని ఠాకూర్ వ్యాఖ్యానించారు. మందిర్‌ అంశం గతంలో పలుసార్లు బీజేపీకి ఉపకరించిందని ఆయన అంగీకరించారు. మందిర్‌ - మసీదు రెండింటినీ నిర్మించాలి. రాముడికి విముక్తి కల్పించాలని అని అన్నారు. మందిర నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రధాని మోడీ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.