Begin typing your search above and press return to search.

వామ‌ప‌క్షాల‌తో పొత్తు..సీట్లపై జనసేనలో డైల‌మా?

By:  Tupaki Desk   |   8 March 2019 5:45 AM GMT
వామ‌ప‌క్షాల‌తో పొత్తు..సీట్లపై జనసేనలో డైల‌మా?
X
ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఆంధ్ర‌ప్రదేశ్‌ లో రాజ‌కీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఆయా పార్టీల‌న్నీ ఒంట‌రిపోరుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా...జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం పొత్తు మంత్రం జ‌పించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల పొత్తుకు జనసేన - సీపీఎం- సీపీఐ మధ్య పొత్తుకు ఓకే చెప్పారు. ఈ మేర‌కు చర్చలు ప్రారంభమయ్యాయి. జనసేన తరఫున మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ - సీపీఐ(ఎం) తరఫున రాష్ట్ర కార్యదర్శి పి.మధు - కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు - సీపీఐ నుంచి రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ - సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు - మాజీ ఎంఎల్‌ సి జెల్లి విల్సన్‌ పాల్గొన్నారు.

విశ్వ‌సనీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం - ప్రతి జిల్లా నుంచి సీపీఐ - సీపీఎం చెరో స్థానాన్ని కోరింది. దీంతో పాటుగా చెరో రెండు లోక్‌ సభ స్థానాలు కూడా కావాలని ప్ర‌తిపాదించిన‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలోని 26 శాసనసభ స్థానాలు - నాలుగు లోక్‌ సభ స్థానాల్లో పోటీ చేస్తామని వామ‌ప‌క్ష పార్టీల నేత‌లు చెప్పిన‌ట్లు స‌మాచారం. అయితే, వామ‌ప‌క్షాల నేత‌ల ప్ర‌తిపాద‌న‌లతో జ‌నసేన నేత‌లు డైలామాలో ప‌డ్డ‌ట్లు స‌మాచారం. వామ‌ప‌క్ష నేత‌లు ప్ర‌తిపాదించిన ఆయా స్థానాల్లో ఎవరి బలమెంత? గతంలో ఆ పార్టీలకు వచ్చిన ఓట్లు, జనసేనకు ఉన్న బలంపై పార్టీ వద్ద ఉన్న నివేదికల ఆధారంగా జ‌న‌సేన నేత‌లు నివేదిక‌లు కోరినట్లు తెలుస్తోంది. స్పష్ట‌తకు రాని నియోజవకర్గాలపై మరోవిడత చర్చించాలని నిర్ణయించారు. ఈ చర్చలు సానుకూల - సామరస్య వాతావరణంలో ఇచ్చిపుచ్చుకునే పద్దతిలో జరిగాయని నాయకులు తెలిపారు. పూర్తి సమాచారంతో మరోసారి చర్చించాలని నిర్ణయించారు. దీంతోపాటుగా, ఈ స‌మావేశం సందర్బంగా రాష్ట్రంలో పార్టీల బలాబలాలు - పోటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. త‌దుప‌రి సమావేశానికి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా హాజరవుతారు.

ఈ స‌మావేశం అనంతరం మధు - రామకృష్ణ - మనోహర్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం - వైఎస్ ఆర్‌ కాంగ్రెస్‌ - బీజేపీ - కాంగ్రెస్‌ లను ఓడించడమే ధ్యేయంగా తమ మూడు పార్టీలతో ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చామన్నారు. రాష్ట్రంలో ఆ నాలుగు పార్టీలు అనుసరిస్తున్న తీరు ప్రజలను అవమానించేదిగా ఉందన్నారు. ఇప్పటి వరకూ తమ మూడు పార్టీలు ఉమ్మడిగా ముందుకు వెళుతున్నాయని - ఇదే పద్ధతిని ఇక ముందు కూడా కొనసాగించాలని నిర్ణయించామన్నారు. ప్రజలు సీపీఎం - సీపీఐ - జనసేన పార్టీలను బలపరిచి ప్రత్యామ్నాయ రాజకీయాలకు మద్దతు ఇవ్వాలని వారు కోరారు.