Begin typing your search above and press return to search.

వామపక్షాల అనైక్యత.. కారుకు బలమే..

By:  Tupaki Desk   |   9 Sep 2018 12:55 PM GMT
వామపక్షాల అనైక్యత.. కారుకు బలమే..
X
తెలంగాణలో ముందస్తు ఎన్నికలతో ప్రతి పార్టీ కూడా వ్యూహరచన చేస్తూ ముందుకు వెళుతోంది. కానీ ఐక్యత అనే పదాన్ని తరుచుగా వాడే వామపక్షాలు మాత్రం ఈ ఎన్నికల్లో మీకు మీరే మాకు మేమే అన్నట్టు వ్యవహరిస్తున్నాయట.. అటు సీపీఐకి కానీ.. ఇటు సీపీఎం కు కానీ టీఆర్ ఎస్ ప్రధాన శత్రువు. కానీ ఈ రెండు సారూప్య పార్టీలు ఏకమై పోటీ చేయకుండా తెలంగాణలో ఎవరి దారి వారే అన్నట్టు వ్యవహరించడం అందరినీ విస్మయపరుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీ ఎదురులేకుండా ఉంది. ఆ పార్టీని ఢీకొట్టడానికి కాంగ్రెస్ మహాకూటమికి ప్లాన్ చేస్తోంది . తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీచేయడానికి రెడీ అవుతున్నాయి. బద్దశత్రువులైనా కాంగ్రెస్- టీడీపీ కూడా పొత్తుకు రెడీ అయిపోతున్నాయి. మధ్యలో కోదండరాంను కూడా కలిపేసి టీఆర్ ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్ మహాకూటమిని తెరపైకి తెస్తోంది. కానీ ఇంత జరుగుతున్నా సీపీఐ - సీపీఎం మాత్రం వేర్వేరుగా ఎన్నికల బరిలో నిలుస్తామని ప్రకటించడం అందరినీ నివ్వెరపరుస్తోంది.

సీపీఐ మహాకూటమిలో చేరడానికి ఆసక్తి కనబరుస్తోందట.. కానీ సీపీఎం మాత్రం కూటమి వైపే చూడడం లేదట.. సీపీఎం బీఎస్పీ - బీఎల్ ఎఫ్ తోపాటు జనసేనతో కలిసి వెళ్లాలని ప్లాన్ చేస్తోందట. జనసేనకు తెలంగాణలో రాజకీయ నిర్మాణమే లేదు. అలాంటి పార్టీతో సీపీఎం కలిసి వెళ్లాలనుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే జనసేనతో తమ స్నేహం 2024ను బేస్ చేసుకొని దీర్ఘకాలికంగా బలపడడానికేనని సీపీఎం చెబుతోంది.

ఇలా సీపీఐ - సీపీఎం వేరు కుంపటితో వేరువేరుగా పోటీపడడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువే.. గడిచిన ఎన్నికల్లోనూ ఇలానే దెబ్బైపోయారని చెబుతుంటారు. టీఆర్ ఎస్ ను ఓడించేందుకు అందరూ ఏకమవుతున్నా వేళ వామపక్షాలు మాత్రం కలిసి రాకపోవడం కారుకు కలిసి వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలా వామపక్షాల అనైక్యత ఇతర పార్టీలకు లాభంగా మారిపోయింది.