Begin typing your search above and press return to search.

పోరాట‌ల గ‌డ్డ‌లో పారిపోయిన పోరు బిడ్డ‌లు...!

By:  Tupaki Desk   |   4 Oct 2019 4:50 AM GMT
పోరాట‌ల గ‌డ్డ‌లో పారిపోయిన పోరు బిడ్డ‌లు...!
X
బండెన‌క బండి క‌ట్టి ప‌ద‌హారు బండ్లు క‌ట్టి ఏ బండ్ల పోత‌వు కొడుకో నైజాం స‌ర్క‌రోడా.. నీ ఘోరీ క‌డ‌తం కొడుకో నైజాం స‌ర్క‌రోడా.. చుట్టుముట్టూ సూర్య‌పేట‌.. న‌ట్ట‌న‌డుమ న‌ల్ల‌గొండ‌.. నువ్వుడేది గోల్కొండ అంటూ నైజాం స‌ర్కారు గుండెల్లో గుబులు పుట్టించిన నేల‌ది.. బాకులు - బ‌ల్లాలు - నాటు తుపాకులు - వొడిసేలు - క‌ర్ర‌లే ఆయుధాలుగా చేసుకుని ఆధునిక తుపాకులు ఉన్న నైజాం సైన్యానికి ఎదురు నిలిచి పోరు చేసిన పోరాటాల గ‌డ్డ అది. అంత‌టి విశిష్ట‌త - చ‌రిత్ర ఉన్న నైజాంను ఎదిరించింది క‌మ్యూనిస్టులు. నైజాం సాగించిన ఆకృత్యాల‌ను - ఆరాచ‌కాల‌ను అడుగ‌డుగునా అడ్డుకుని ఎదిరించిన ధీశాలులు ఎంద‌రో.. అన్యాయానికి - అక్ర‌మాల‌కు - దాడుల‌కు - దౌర్జ‌న్యాల‌కు - అత్య‌చారాల‌కు గురౌవుతున్న ఎందరో అభాగ్యుల‌కు అండ‌గా నిలిచిన క‌మ్యూనిస్టులు. వీరింద‌రికి నెల‌వైంది న‌ల్ల‌గొండ జిల్లా.

ఎంద‌రో త్యాగాల పునాదుల‌పై నిర్మిత‌మైన క‌మ్యూనిస్టు పార్టీ ఇప్పుడు తాబేదార్ల‌కు - దొర‌ల‌కు అండ‌దండ‌లు అందిస్తూ రోజు రోజుకు త‌న ఉనికిని కోల్పోతుంది. దొర‌ల‌, దౌర్జ‌న్య‌కారులకు అండ‌గా నిలిస్తూ - బాధితుల ప‌క్షం వ‌హించ‌డం ఏనాడో మ‌రిచిపోయిన‌ట్లున్నారు. అందుకే ఇప్పుడు తెలంగాణ‌లో మరో నిరంకుశ పాల‌న చేస్తున్న తెరాస ప్ర‌భుత్వంకు క‌మ్యూనిస్టులు అండ‌గా నిలిచారు. అందుకే ఇప్పుడు తెలంగాణ లోని ఈ పోరాటాల గ‌డ్డ (ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా) సూర్యాపేట జిల్లా హుజూర్‌ న‌గ‌ర్‌ లో జ‌రుగుతున్న ఉప‌పోరులో పోరాట బిడ్డ‌లు ఒక్క‌రు కూడా పోటీ చేయ‌డం లేదు.

క‌మ్యూనిస్టుల కంచుకోటైన న‌ల్ల‌గొండ జిల్లాలో క‌మ్యూనిస్టుల‌కు ఇంకా ఎంతో ప‌ట్టుంది. అలాంటి న‌ల్ల‌గొండ జిల్లాలో జ‌రుగుతున్న ఉప‌పోరులో అటు సీపీఎం - ఇటు సీపీఐ పార్టీల నుంచి అభ్య‌ర్థులు లేకుండా పోయారు. క‌మ్యూనిస్టుల కంచుకోట‌లో క‌మ్యూనిస్టులు ఉనికి లేకుండా ఎందుకు చేసుకున్నారో ఏమో క‌మ్యూనిస్టు నాయ‌క‌త్వానికే తెలియాలి. సీపీఎం నుంచి నామినేష‌న్ వేసిన అభ్య‌ర్థి శేఖ‌ర‌రావు తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది. అంటే సీపీఎం నేత‌ల‌కు నామినేష‌న్ ప‌త్రాలు నింప‌డం కూడా చేత‌కానంత భావ దారిద్రంలో ఉన్నార‌న్న మాట‌. ఇక సీపీఐ అస‌లు అభ్య‌ర్థినే నిల‌బెట్ట‌కుండా ఏకంగా టీ ఆర్ ఎస్‌ కు స‌పోర్టు చేస్తోంది.

తెల్లారి లేచిం దగ్గ‌ర నుంచి అధికార టీఆర్ ఎస్ పాల‌న‌పై నిప్పులు చెరిగే ఈ సీపీఐ నేత‌లు ఇప్పుడు త‌గదున‌మ్మా అని అదే టీఆర్ ఎస్ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ఏంటో ఎవ‌రికి అంతు చిక్క‌డం లేదు.. వాస్తవానికి హుజూర్‌ న‌గ‌ర్‌ లో సీపీఎం - సీపీఐల‌కు మంచి ప‌ట్టే ఉంది. కానీ ఈ క‌మ్యూనిస్టులు బూర్జువా క‌మ్యూనిస్టులుగా మారిపోయార‌నే అప‌వాదు లేక‌పోలేదు.. దీనికి తోడు క‌మ్యూనిస్టు నాయ‌కత్వాలు కూడా అగ్ర‌వ‌ర్ణాల చేతుల్లో ఉండ‌టంతో వారి వ‌ర్గ ప్ర‌యోజ‌నాల కోసం అగ్ర‌వ‌ర్ణ నాయ‌క‌త్వ పార్టీల కొమ్ము కాస్తున్నాయ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

అందుకే సీపీఐ పార్టీ కార్య‌ద‌ర్శి త‌న రెడ్డి సామాజిక వ‌ర్గం అయిన నేత‌కు మ‌ద్ద‌తు ఇస్తుండ‌గా - ఇక సీపీఎం కూడా అగ్ర‌కులానికి చెందిన వ్య‌క్తే నాయ‌త‌క్వంలో ఉన్నారు. దీంతో బాధితుల ప‌క్షం వ‌హించి ఈ ఉప పోరులో ప్ర‌భుత్వ నిరంకుశ పాల‌న‌ను విమ‌ర్శించాల్సిన ఈ పార్టీలే.. ఇప్పుడు వారి ప‌క్షం చేర‌డం విడ్డూర‌మే మ‌రి.. ఎంతైనా వ‌ర్గ ప్ర‌యోజ‌నాలే ముఖ్యం క‌దా..!