Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్‌ ను తిట్టి..నాలిక క‌రుచుకున్న నారాయ‌ణ‌

By:  Tupaki Desk   |   23 Jan 2018 9:36 AM GMT
గ‌వ‌ర్న‌ర్‌ ను తిట్టి..నాలిక క‌రుచుకున్న నారాయ‌ణ‌
X
సిద్ధాంతాల ప్రాతిపదిక‌న ప‌నిచేసే క‌మ్యూనిస్టు పార్టీ అయిన‌ సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి హోదాలో ఉన్న‌ప్పటికీ...త‌నకు తోచింది మాట్లాడేయ‌డం...న‌చ్చింది చేయ‌డం... ప్ర‌ముఖ నాయ‌కుడు నారాయ‌ణ వ్య‌క్తిత్వం. అలా మ‌న‌సులో ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడే నారాయ‌ణ తాజాగా నాలిక క‌రుసుకున్నారు. తెలుగు రాష్ర్టాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ విష‌యంలో నోరు జారి..ఒక రోజు గ‌డిచిన త‌ర్వాత ఆ విష‌యాన్ని గ‌మ‌నించి... తాను అలా వ్య‌వ‌హ‌రించాల్సింది కాద‌ని మీడియా ముఖంగా వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు!

విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గవర్నరు నరసింహన్ టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తి...గవర్నర్ వ్యవస్థకే కళంకం తీసుకువచ్చారని అన్నారు. గవర్నర్‌ నర్సింహన్‌ ఒక బఫూన్‌ లా మారారన్నారు. 26న జరిగే గణతంత్ర వేడుకలకు ఆహ్వానం పంపారని, ఆయన తీరుకు నిరసనగా కార్యక్రమానికి తాను వెళ్లడంలేదని నారాయ‌ణ అన్నారు. రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నారాయణ మండిప‌డ్డారు. ఢిల్లీలో ఆప్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రపతి కొంగజపం చేస్తున్నార ని విమర్శించారు.

అయితే, ఈ వ్యాఖ్య‌ల‌ను నారాయ‌ణ స‌మీక్షించుకున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే మ‌రుస‌టి రోజే ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల‌ చేస్తూ..వివ‌ర‌ణ ఇచ్చారు. `గ‌వ‌ర్న‌ర్ గారు...మిమ్మ‌ల్ని బ‌ఫూన్ అన‌డం నా పొర‌పాటు. ఆ వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కు తీసుకుంటున్నాను` అంటూ వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న ఇబ్బందిక‌ర‌మైన‌ వ్యాఖ్య‌ల‌పై నారాయ‌ణ తీరు హుందాగా ఉంద‌ని కొంద‌రు పేర్కొంటూనే...అయినా అలా ముందుగా మాట్లాడేయడం ఆయ‌న స్థాయిలో ఉన్న నాయ‌కుల‌కు స‌రికాద‌ని అంటున్నారు.