Begin typing your search above and press return to search.

కేసీఆర్ చ‌రిత్ర విప్పిన కామ్రేడ్స్‌!

By:  Tupaki Desk   |   2 April 2018 7:43 AM GMT
కేసీఆర్ చ‌రిత్ర విప్పిన కామ్రేడ్స్‌!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిపై కామ్రేడ్స్ విరుచుకుప‌డ్డారు. ఇటీవ‌ల కాలంలో కేసీఆర్ ను ఇంత తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డినోళ్లు లేర‌నే చెప్పాలి. ఏదో తిట్టామంటే తిట్టామ‌న్న‌ట్లు కాకుండా.. ఒక ప‌ద్ధ‌తిగా.. సాక్ష్యాలు.. ఆధారాలు చూపిస్తూ.. కేసీఆర్ ఇమేజ్ ను పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. కాకుంటే.. కమ్యూనిస్ట్ ఆగ్ర‌నేత‌లు తిట్టిన తిట్ల పురాణం మీడియాలో పెద్ద‌గా క‌వ‌ర్ కాకపోవ‌టంతో.. ప్ర‌జ‌ల దృష్టిలో పెద్ద‌గా ప‌డ‌లేదు.

కేసీఆర్ చెప్పే నీతుల‌కు కౌంట‌ర్ తో పాటు.. ఆయ‌న వ్య‌వ‌హార‌శైలిని సీపీఐ అగ్ర‌నాయ‌క‌త్వం దునుమాడింది. కాంగ్రెస్‌.. బీజేపీయేత‌ర ఫ్రంట్ అని చెబుతున్న కేసీఆర్ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. రాష్ట్రాన్ని చ‌క్క‌దిద్దుకోవ‌టం చేత‌కాని కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పెడ‌తారా? అంటూ నిప్పులు చెరిగిన వారు.. తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత‌లా అప్పుల పాలు చేశారో వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

సీపీఐ ద్వితీయ రాష్ట్ర మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో సీపీఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి.. సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె. నారాయ‌ణ‌.. అతుల్ కుమార్‌.. చాడా వెంక‌ట‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. కేసీఆర్ ను ఉతికి ఆరేసినంత ప‌ని చేసిన వారి ప్ర‌సంగాలు ఎంత తీవ్రంగా ఉన్నాయన్న‌ది చూస్తే..

+ ప్ర‌జా ఉద్య‌మాలంటే భ‌య‌ప‌డే ఓ పిరికిపంద తెలంగాణ‌ను పాలిస్తున్నాడు. సీఎం కేసీఆర్ కు ద‌మ్ముంటే ప్ర‌జా ఉద్య‌మాల ప‌ట్ల సానుకూల దృక్ఫ‌థంతో వ్య‌వ‌హ‌రించి.. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను అంగీక‌రించాలి. ప్ర‌తిప‌క్షాల‌పై నిర్బంధాన్ని ప్ర‌యోగిస్తూ.. గొంతు నొక్కుతున్నారు.

+ క‌న‌క‌పు సింహాస‌నం మీద శున‌క‌మును కూర్చొండ‌బెట్టిన‌ట్లు సంస్కారం లేని కేసీఆర్ ను తెలంగాణ ముఖ్య‌మంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. ఇది తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అవ‌మానం. దౌర్బాగ్యం. సిగ్గు.. శ‌రం.. చీము నెత్తురు.. నైతిక విలువ‌లున్న వారెవ‌రూ కేసీఆర్ మాదిరి రాజ‌కీయం చేయ‌రు.

+ లాఠీ చార్జ్ లు.. తుపాకీ తూటాల‌కు ఎదురొడ్డి నిలిచైనా ప్ర‌భుత్వాల నియంతృత్వ విధానాల‌పై పోరాటాల‌కు సిద్ధం కావాలి. ఎన్నిక‌ల‌కు ముందు కేసీఆర్ అనేక వాగ్దానాలు చేశారు. ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూమి ఇస్తాన‌ని చెప్పారు. అంద‌రికి ఇస్తాన‌ని తాను చెప్ప‌లేద‌ని మాట మారుస్తున్నారు. ఆయ‌న ఇచ్చిన లెక్క‌ల ప్ర‌కారం అయితే రాష్ట్రంలో ద‌లితులంద‌రికి భూమి ఇవ్వాలంటే 200 ఏళ్లు ప‌డుతుంది. మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు.

+ తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రూ క‌ట్టే రూ.100 ప‌న్నులో రూ.35 వ‌డ్డీ కింద ఖ‌ర్చు చేస్తున్నారు. కేసీఆర్ ఇంకో ఐదేళ్లు అధికారంలో ఉంటే ప‌న్ను కింద క‌ట్టే ప్ర‌తి రూ.100లో రూ.75 అప్పుల‌కు వ‌డ్డీ కిందే జ‌మ చేయిస్తారు.

+ ప్ర‌తిప‌క్ష పార్టీల ఎమ్మెల్యేలంద‌రిని టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నావు. ఏ నైతిక‌త ఆధారంగా ఈ ప‌ని చేస్తున్నావు? స‌ఈపీఐకి ఉన్న ఒక్క ఎమ్మెల్యేనూ ప్ర‌లోభ పెట్టి టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు.

+ తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో సీపీఐ ఎమ్మెల్యేల ఓట్ల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్సీని గెలిపించుకోలేదా? కేశ‌వ‌రావును రాజ్య‌స‌భ‌కు పంపింది మా ఓట్ల‌తో కాదా? ఫిరాయించిన వారితో రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు వెళ్లే ద‌మ్ము కేసీఆర్ కు లేదు.

+ ఉట్టికి ఎగ‌ర‌లేన‌మ్మ ఆకాశానికి ఎగురుతానంద‌న్న సామెత కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ విష‌యంలో స‌రిగ్గా స‌రిపోతుంది. రాష్ట్రాన్ని చ‌క్క‌దిద్ద‌లేడు కానీ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పెట్టి ఉద్ద‌రిస్తాడా?

+ తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఢిల్లీ లోని మా పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చి బ‌ర్ద‌న్ కాళ్లు ప‌ట్టుకోలేదా? మ‌ఖ్దూంభ‌వ‌న్ కు వ‌చ్చి భోజ‌నం చేయ‌లేదా? భోజ‌నం చేశామ‌న్న బుద్ధి కూడా కేసీఆర్ కు లేదు. తెలంగాణ వ‌చ‌చాక సీపీఐ ఉద్య‌మాలు చేస్తే అభాండాలు వేస్తున్నారు.

+ బీజేపీని అవిశ్వాసం నుంచి కాపాడేందుకు ఓవైపు పార్ల‌మెంటుంలో శిఖండి పాత్ర పోషిస్తూ.. మ‌రోవైపు ఫ్రంట్ అంటూ మ‌మ‌తా బెన‌ర్జీని క‌లిశారు.

+ ప్ర‌పంచంలో అత్యంత ప‌నికిమాలిన సీఎంల‌లో కేసీఆర్ ముందుటారు. ఆయ‌న పాల‌న‌ను అంతం ప‌లికేలా నిర్ణ‌యాన్ని మ‌హాస‌భ‌లు పూర్తి అయ్యేలోపు ప్ర‌క‌టిస్తాం.