Begin typing your search above and press return to search.

సీఈసీ టేబుల్ వ‌ద్ద‌కు కేసీఆర్ అత్యుత్సాహం!

By:  Tupaki Desk   |   7 Sep 2018 10:18 AM GMT
సీఈసీ టేబుల్ వ‌ద్ద‌కు కేసీఆర్ అత్యుత్సాహం!
X
అనుకున్న‌దే జ‌రిగింది.అనుమానించిందే నిజ‌మైతే. ఉత్సాహం ఉండ‌టం మంచిది కానీ.. మోతాదు మించిన ఉత్సాహం ఏమాత్రం మంచిది కాదు. అది అత్యుత్సాహంగా మారి.. లేనిపోని త‌ల‌నొప్పుల్ని తెచ్చి పెడుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిస్థితి కూడా అదే రీతిలో ఉండ‌నుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

తెలంగాణ అసెంబ్లీని ర‌ద్దు చేస్తూ.. ముంద‌స్తుకు సై అన్న కేసీఆర్ నిన్న మ‌ధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన వైనం గుర్తుంది క‌దా.

ఆ సంద‌ర్భంగా ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయ‌న్న విష‌యాన్ని చెబుతూ.. త‌న‌కున్న నాలెడ్జ్ ప్ర‌కారం అంటూ షెడ్యూల్ ఎప్పుడు విడుద‌ల అవుతుంది? ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయి? ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎప్పుడు వెలువ‌డే అవ‌కాశం ఉంద‌న్న విష‌యాల్ని చెప్పారు. ఇదిలా చెప్పి వ‌దిలేస్తే ఒక ర‌కంగా ఉండేది.

ఇదే మీడియా స‌మావేశంలో తాను కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ముఖ్య అధికారుల‌తో మాట్లాడాన‌ని.. చీఫ్ ఎన్నిక‌ల క‌మిష‌న్ తోనూ మాట్లాడ‌టం జ‌రిగింద‌ని చెప్పారు. ఈ రెండింటిని లింకు క‌డితే అదో రాజ‌కీయ వివాదంగా మారే అవ‌కాశం ఉంది.

ఇదే విష‌యాన్ని తాజాగా సీపీఐ నేత సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల షెడ్యూల్ కేంద్ర ఎన్నిక‌ల సంఘం మాత్ర‌మే ప్ర‌క‌టించాల‌ని.. కేసీఆర్ ఎలా ప్ర‌క‌టిస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. ఏదో మీడియా ముందు ప్ర‌శ్నించ‌టంతో స‌రిపెట్ట‌కుండా.. సీఈసీ వ‌ద్ద‌కు వెళ్లి తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ ఓపీ రావ‌త్ తో సీపీఐ నేత‌లు భేటీ అయ్యారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడిన సుర‌వ‌రం.. ఎన్నిక‌లు ఎప్పుడు జ‌ర‌గాలో ఈసీ నిర్ణ‌యిస్తుంద‌ని.. అలాంటి కేసీఆర్ ఎలా చెబుతార‌ని ప్ర‌శ్నించారు. విప‌క్ష నేత‌ల్ని స‌న్నాసుల‌ని తిట్టే కుసంస్కారి కేసీఆర్ అని.. ఆయ‌న‌కు ప్ర‌జ‌లు బుద్ధి చెబుతారని మండిప‌డ్డారు. సుర‌వ‌రం మాష్టారు చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.