Begin typing your search above and press return to search.

చంద్రబాబు రాయలసీమవాసులను రౌడీలన్నారా?

By:  Tupaki Desk   |   22 Feb 2016 6:49 AM GMT
చంద్రబాబు రాయలసీమవాసులను రౌడీలన్నారా?
X
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు కానీ మెజార్టీ సీట్లు లభిస్తే తన చెవిని కోసుకుంటానని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు నారాయణ వ్యాఖ్యానించటం.. దీనికి కౌంటర్ గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. టీఆర్ ఎస్ గ్రేటర్ గెలుపుతో తెలంగాణపై ఫోకస్ తగ్గించిన నారాయణ ఏపీ మీద దృష్టి సారించారు. ఆ మధ్యన కాపులను బీసీల్లో చేర్చాలంటూ తునిలో చోటు చేసుకున్న పరిణామాలపై నారాయణ తాజాగా స్పందించారు.

తునిలో రైలు తగలబడితే రాయలసీమ రౌడీలు తగులబెట్టారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అనటం దారుణమని.. రాయలసీమ బిడ్డనని చెప్పుకునే చంద్రబాబు ఆ ప్రాంతాన్ని రౌడీ ప్రాంతంగా చిత్రీకరిస్తారా? అంటూ మండిపడుతున్నారు.

తుని రైలు దగ్థం ఇష్యూలో.. గోదావరి జిల్లా ప్రాంతానికి చెందిన ప్రజలు శాంత స్వభావులని.. అంత త్వరగా ఆవేశానికి లోనుకారన్న మాటతో పాటు.. రైలు దగ్ధం వెనుక విపక్ష నేత కుట్ర ఉందన్న ఆరోపణ స్వరంతో మాట్లాడారే తప్పించి.. కామ్రేడ్ నారాయణ చెప్పినట్లుగా రౌడీలన్న గొంతుతో మాట్లాడలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

సమస్యల మీద పోరాడటం మానేసి.. భావోద్వేగాలను రెచ్చగొట్టే లక్ష్యంగా నారాయణ మాటలు ఉండటం విచారకరం. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం ఏమిటన్న కోణం మీద దృష్టి పెట్టాలే కానీ.. అందుకు భిన్నంగా సమస్య మరింత జటిలంగా మారే వ్యాఖ్యలు చేయకూడదు. చంద్రబాబు అనని మాటల్ని అన్నట్లుగా చెబుతున్న నారాయణ తీరు చూస్తుంటే.. ఏపీ ప్రాంత ప్రజలు సుఖంగా ఉండటం ఆయనకు ఇష్టం లేదేమోనని జనం భావిస్తున్నారు.