Begin typing your search above and press return to search.

బాబు అల్ప‌సంతోషి కాబ‌ట్టే దానికి ఓకే చెప్పారు!

By:  Tupaki Desk   |   1 Dec 2016 7:30 PM GMT
బాబు అల్ప‌సంతోషి కాబ‌ట్టే దానికి ఓకే చెప్పారు!
X
సీపీఐ జాతీయ కార్యాద‌ర్శి కే నారాయ‌ణ పెద్ద నోట్ల ర‌ద్దు - త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌పై మ‌రోమారు త‌న‌దైన శైలిలో స్పందించారు. ఒంగోలులోని స్టేట్‌ బ్యాంక్‌ అఫ్‌ ఇండియా బ్యాంక్‌లో నగదు లావాదేవీలను నారాయణ పరిశీలించారు. బ్యాంకు బయట క్యూలో నిలబడ్డ ప్రజలను కరెన్సీ కష్టాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు తాము బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును తీసుకోలేకపోతున్నామని, గంటల కొద్దీ క్యూలో నిలబడితే చివరకు నాలుగువేల రూపాయలు చేతుల్లో పెడుతున్నారని ఖాతాదారులు నారాయణకు మొరపెట్టుకున్నారు. దీంతో బ్యాంకు మేనేజర్‌ ను నారాయణ నిలదీశారు. ఖాతాదారులకు సరిపడినంత డబ్బు ఎందుకు పంపిణీ చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. జనం డిమాండ్‌ కు తగినన్ని డబ్బులు రావడం లేదని బ్యాంకు మేనేజర్‌ చెప్పిన జవాబుకు నారాయణ మండిపడ్డారు. ఇలా అయితే జనం నుంచి ఉద్యమాలు పుట్టుకొస్తాయని హెచ్చరించారు.

ఈ సంద‌ర్భంగా దేశంలో పరిస్థితి చేయిదాటి పోయిన తరువాత ఏపీ సిఎం చంద్రబాబు కన్వీనర్‌ గా క్యాష్‌ లెస్‌ కమిటీ ఏర్పాటు చేశారని, చంద్రబాబు అల్ప సంతోషి కావడంతో ఈ పనికి ఒప్పుకున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు భుజంపై తుపాకీ పెట్టి బీజేపీ కాల్పులు జరిపేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. జనంలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని, పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజా ఉద్యమాలు మొదలవుతాయని నారాయ‌ణ హెచ్చ‌రించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. మోడీ ప్రభుత్వం శాడిస్టు ప్రభుత్వంలా మారిందని, మోడీ వంద సార్లు గుంజిళ్లు తీసినా ఈ పాపం పోదని నారాయ‌ణ‌ శాపనార్ధాలు పెట్టారు.

కరువు దాడుల తరహాలో కరెన్సీ కోసం జనం దాడులు చేసే ప్రమాదం పొంచి ఉందని కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలకు నారాయణ హెచ్చరించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే జనం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆ రెండు నోట్ల రద్దు తరువాత 70 మంది చనిపోయారని, ఇవన్నీ మోడీ ప్రభుత్వం చేసిన హత్యలేనని అభివర్ణించారు. చనిపోయిన కుటుంబాలకు వెంటనే 20 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు మోడీ అబ్బసొత్తు అడగడం లేదని తాము కష్టపడిదాచుకున్న సొమ్మును అడుగుతున్నారని నారాయ‌ణ అన్నారు. ప్రజలు డబ్బులు అడుగుతుంటే గజదొంగల్లా చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సరిపడినంత డబ్బులు బ్యాంకులకు అందచేయాలని డిమాండ్‌ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/