Begin typing your search above and press return to search.

అద్గదీ సీపీఐ నారాయణ అంటే.. కవిత సీబీఐ విచారణ లైవ్ కు డిమాండ్

By:  Tupaki Desk   |   11 Dec 2022 10:05 AM GMT
అద్గదీ సీపీఐ నారాయణ అంటే.. కవిత సీబీఐ విచారణ లైవ్ కు డిమాండ్
X
రాజకీయాల్లో వామ పక్షాలది ప్రత్యేక దారి. అధికారం దగ్గరికి వచ్చినా అర్రులు చాచరు.. ప్రధాని పదవి అయినా సరే ఇష్టం లేకుంటే వద్దంటారు.. అవసరమైతే పొత్తు పెట్టుకుంటారు.. వీలు కాకుంటే దూరంగా వెళ్లిపోతారు. అదేమంటే.. ప్రజా సమస్యలు వినిపిచేందుకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం కావాలంటారు. ఇతర రాజకీయ పార్టీలను బూర్జువా పార్టీలుగా విమర్శిస్తారు. అవినీతి, అక్రమాలపై అలుపెరగకుండా పోరాడుతూనే.. వారి నుంచే పార్టీని నడిపించేందుకు చందాలు అడుగుతారు. ఇక అలాంటి పార్టీల్లో కె.నారాయణలాంటి నాయకుడు ఉంటే చెప్పాల్సిన పనిలేదు. తాజాగా నారాయణ మరో సంచలనం రేపారు. దిల్లీ మద్యం కేసులో విచారించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె విచారణను ప్రత్యక్షప్రసారం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు సైతం విచారణను ప్రత్యక్షంగా చూపిస్తుంటే.. సీబీఐ ఆ పక్రియను ఎందుకు పాటించడంలేదని ప్రశ్నించారు. మరోవైపు ఈ కేసులో విచారించేందుకు ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ అధికారులు రెండు బృందాలుగా వచ్చారు. అయితే, కేవలం సాక్షిగా మాత్రమే కవిత వివరణను నమోదు చేయనున్నారు.

సీఆర్‌పీసీ 160 కింద ఆమె వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు. విచారణకు వచ్చిన సీబీఐ బృందంలో మహిళా అధికారులు కూడా ఉన్నారు. సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశముంది. ఈ కేసులో కవిత విచారణ కోసం ఆరో తేదీని సూచిస్తూ సీబీఐ మొదట లేఖ రాయగా... ఆ రోజు తనకు ఇతర కార్యక్రమాలున్నాయని 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని ఆమె ప్రత్యుత్తరం రాశారు. దీంతో సీబీఐ ఆదివారం విచారిస్తామని సమాచారం ఇవ్వగా, కవిత అంగీకరించారు.

ఏం చేసినా ఏం మాట్లాడినా ఆయనకే చెల్లు

చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణ విద్యార్థి దశలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి చదువుకున్నారు. ఆ రోజుల్లోనే వీరి మధ్య సైద్ధాంతిక వైరం సాగేది. అంతేగాక రాజకీయంగానూ భిన్న పార్టీలు కావడంతో ఆ విభేదాలు పెరుగుతూ వచ్చాయి. మరోవైపు నారాయణ, చంద్రబాబు ఇద్దరూ రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉమ్మడి ఏపీలో కీలకపాత్ర పోషించారు. రెండు రాష్ట్రాలుగా విభజన అయిన తర్వాత నారాయణ సీపీఐ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇక నారాయణది మొదటి నుంచి ప్రత్యేక శైలి.2007 అక్టోబరు 2న ఆయన గాంధీ జయంతి అయినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా చికెన్ తినడం అప్పట్లో వివాదాస్పదం అయింది.

దీంతో ఏడాది పాటు చికెన్ ముట్టుకోనని నారాయణ శపథం చేశారు. దానిని నిష్టగా పూర్తిచేశారు కూడా. పేదలకు భూములు పంచాలని నారాయణ ఓసారి ప్రకాశం జిల్లాలో చేసిన సాహోసేపేత పోరాటం ఇప్పటికీ పెద్ద కథే. అప్పటి ప్రభుత్వం నిర్భంధాలు విధించినా.. బోటులో వెళ్లి మరీ తాను అనుకున్నది చేశారు. ఇక 2009 ఎన్నికలకు ముందు మహా కూటమిలో భాగంగా ఆయన కీలక నాయకుడిగా వ్యవహరించారు. 2004-09 మధ్య నారాయణ వివాదాస్పదమైన సందర్భాలు బోలెడు. 2007లో గోకుల్ చాట్ పేలుళ్లలో చనిపోయినవారికి నివాళులర్పించే కార్యక్రమంలో నారాయణ, అప్పటి సీఎం వైఎస్ నవ్వుతూ కనిపించడం విమర్శలకు దారితీసింది. మొన్నటికి మొన్నఓ ఇంటర్వ్యూలో ఓ సామాజిక వర్గం వారి మనోభావాలను కించపరిచేలా మాట్లాడడంతో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

చిరంజీవి నుంచి నాగార్జున వరకు ఎవరినీ వదల్లే

వాస్తవం ఎలా ఉన్నా నారాయణ మాట చాలా సూటి. ఓ విషయంలో ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని సైతం చిల్లర బేరగాడు అంటూ తప్పుబట్టారు. ఆ విమర్శలు తీవ్ర సంచలనం కావడంతో చిరుకు క్షమాపణలు చెప్పారు నారాయణ. ఇక బిగ్ బాస్ విషయంలో నారాయణ వైఖరి సుస్ఫష్టం. దానినో దుర్మార్గమైన పనితో పోలుస్తారు ఆయన. ఇదనే కాదు.. చాలా విషయాల్లో నారాయణ మాటలు సీపీఐలోనే చర్చనీయాంశమయ్యాయి. కొన్నిసార్లు విమర్శలు శ్రుతిమించినా, నారాయణ చాలా బోళా మనిషి. ఎలాంటి ఉద్దేశాలు ఆపాదించలేని వ్యక్తిత్వం తనది. దీనికి ఉదాహరణ తాజా వ్యాఖ్యలే. ఇటీవలి మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ.. టీఆర్ఎస్ కు మద్దతిచ్చింద. అక్కడ ఆధికార పార్టీ గెలుపులో సీపీఐదే కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఇకపై రెండు పార్టీలు కలిసి నడవాలని నిర్ణయించాయి. రానున్న ఎన్నికల్లో సీపీఐ కొన్ని స్థానాల్లో పొత్తు పెట్టుకుని బరిలో దిగే అవకాశం ఉంది. అలాంటి సమయంలోనూ నారాయణ.. సీబీఐ కవితను విచారిస్తున్న తీరును లైవ్ టెలికాస్ట్ చేయాలంటూ వ్యాఖ్యానించారు. దీన్నిబట్టే నారాయణ తీరు ఏంటో తెలిసిపోతోంది.

తండ్రితో మరోసారి కవిత భేటీ..

ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ నోటీసులు అందుకున్నాక గత వారం ఓ సారి ప్రగతి భవన్ కు వెళ్లి తండ్రి కేసీఆర్ తో కవిత సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఏం చేయాలో వారు చర్చించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, కవిత శనివారం మళ్లీ ప్రగతిభవన్‌కు వెళ్లి తండ్రిని కలిశారు. మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాత కవితతో సీఎం కేసీఆర్ మాట్లాడినట్లు తెలుస్తోంది. రాజకీయకక్షతో ఇబ్బందులు పెట్టేందుకు భాజపా ఎన్ని ప్రయత్నాలు చేసినా... అవి ఫలించవని, సీబీఐ విచారణ దానిలో భాగమేనని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. సీబీఐకి ధైర్యంగా సమాధానాలు చెప్పాలని సూచించినట్లు తెలిసింది. ఈ విషయంలో ఇప్పటికే కవిత పలువురు న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నట్లు సమాచారం. పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ తమ ఇంటికి రావద్దని కవిత వారిని కోరారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం వద్ద బీఆర్ఎస్ నేతలు భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగులు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌.. విల్‌ నెవర్‌ ఫియర్‌ (యోధుని కుమార్తె..ఎన్నటికీ భయపడదు) అని వాటిపై రాశారు. సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత ఇంటి మార్గంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.