Begin typing your search above and press return to search.

నయీం కేసులో మాజీ డీజీపీల‌కు నార్కో టెస్ట్‌

By:  Tupaki Desk   |   22 Oct 2016 1:14 PM GMT
నయీం కేసులో మాజీ డీజీపీల‌కు నార్కో టెస్ట్‌
X
గ్యాంగ్ స్ట‌ర్ నయిూం కేసులో పురోగ‌తి ఏమీ లేక‌పోవ‌డంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. న‌యీం కేసులో నిజానిజాలు తెలియాలంటే... మాజీ సీఎంలు - హోం మంత్రులు - డీజీపీలకు నార్కో టెస్ట్ చేయించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఒక‌వేళ నిజాలు బయటపడక‌పోతే రాజకీయాల నుండి తప్పకుంటాన‌ని ప్ర‌క‌టించారు. కృష్ణాజలాలపై ఇద్దరు చంద్రులూ ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీని నిలదీయాలని నారాయ‌ణ సూచించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన నారాయ‌ణ ఈ మేర‌కు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

నయిూం కేసులో 1996 నుండి ఇప్పటివరకూ పనిచేసిన ముఖ్యమంత్రులు - హోంశాఖ మంత్రులు - డీజీపీలకు నార్కో టెస్ట్‌ లు చేయిస్తే అసలు నిజాలు వెలుగు చూస్తాయని, లేదంటే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని నారాయణ సవాలు విసిరారు. వీరందరికీ తెలియకుండా నయీం ఎదగలేదన్నారు. ఇటీవల హైకోర్టులో అడ్మిట్ అయిన ఈ కేసును న్యాయస్థాన పర్యవేక్షణలో సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని నారాయణ డిమాండ్ చేశారు. దాసరి భవన్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నయీం కేసు ఒక్క తెలంగాణాకే పరిమితం కాదని, ఉమ్మడి రాష్ట్రంగా ఉ న్నప్పటి నుండి నయిూం దందాలు కొనసాగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నయిూంని పెంచి, పోషించిన పెద్దలతోపాటు వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం వల్లే అతడ్ని చంపేశారని ఆరోపించారు. ప్రభుత్వ వ్యవస్థలో చీకటి కోణంలో భాగంగా నయిూం లాంటి వాళ్లను సృష్టించి అనధికారికంగా డబ్బును - ఆయుధాలను ఇచ్చి ప్రభుత్వం చేయలేని పనిని వీరితో చేయిస్తారని నారాయ‌ణ‌ తెలిపారు. రాజకీయనాయకులు - పోలీసు ఉన్నత అధికారుల్లో కొందరు అవినీతి వ్యాపారాలను కాపాడుకోవడం కోసం ఇలాంటి వాళ్లను అండగా పెట్టుకుంటారని నార‌య‌ణ ఆరోపించారు. అయితే ఇప్పటి వరకూ ఈ కేసులో తిమింగలాలను వదిలేసి చిన్న చిన్న చేపలను మాత్రమే పట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వమే ద్వందనీతిని అనుసరిసూ చీకటికోణాన్ని అనుసరిస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై బ్లాక్‌ మెయిల్ ధోర‌ణిని అవలంభిస్తోందని నారాయ‌ణ ఆరోపించారు. వ్యవస్థలో ఉన్న లొసుగులను బయట పెట్టాలంటే సిట్‌ తో కాకుండా సీబీఐ చేత దర్యాపు చేయించాలన్నారు.

నదీజలాల పంపకం విషయమై రెండు తెలుగు రాష్ర్టాల‌ మధ్య నెలకొన్న తగవును కేంద్ర ప్రభుత్వమే సమర్ధవంతంగా పరిష్కరించాలని నారాయ‌ణ డిమాండ్ చేశారు. కావేరీ జలాల విషయంలో బీజేపీ తమిళనాడు కంటే కర్ణాటకలో తమకు పట్టు ఉన్నందున అక్కడ రాజకీయం చేస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలూ సామరస్యంగా విడిపోలేదని, దీనిని ఇప్పుడిప్పుడే ప్రజలు మరచిపోతున్న సమయంలో పండుమీద కారం చల్లినట్లు నదీజలాల విషయాన్ని కేంద్రం అనవసరంగా సమస్యాత్మకం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజంగా చంద్రబాబు - కేసీఆర్ లకు చిత్తశుద్ది ఉంటే ఇద్దరూ కలసి మోడీని నిలదీయాలని నారాయణ సూచించారు. అప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టులో ఎటూ తేలదు కనుక రాజకీయంగానే ఈ సమస్య పరిష్కారానికి కేంద్రమే చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వ‌డంతో ఉన్నది పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని నారాయ‌ణ విశ్లేషించారు. చితూరు జిల్లాలో నెలకొల్పాలనుకున్న మన్నవరం ప్రాజెక్టును నిలిపివేయడమే దీనికి ఉదాహరణగా నిలుస్తుందని నారాయ‌ణ చెప్పారు. ఈ ప్రాజెక్టు అనవసరమని కొందరు, తరలించడంలేదని మరికొందరు కేంద్ర పెద్దలు వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పబట్టారు. ఈ ప్రాజెక్టును ప్రజా ఉద్యమం ద్వారా సాధించుకుంటామన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/