Begin typing your search above and press return to search.

బాబుకు మూడు నామాలు పెట్టిన మోడీ

By:  Tupaki Desk   |   11 Jan 2018 5:30 PM GMT
బాబుకు మూడు నామాలు పెట్టిన మోడీ
X
ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌ల‌కు పెట్టింది పేర‌యిన సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ మ‌రోమారు అదే త‌ర‌హా కామెంట్లు చేశారు. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబును పొగుడుతూ - ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోడీ కొత్త రాజధానికి కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన మోడీ మట్టి కొట్టిపోయారని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా లేదని, అమరావతి లేదని - పోలవరం ఊసు లేదని ఆయన చెప్పారు. ఈ రకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ మూడు నామాలు పెట్టి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.

అయితే ఇదే స‌మ‌యంలో ఆయ‌న ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు అయిన అమ‌రావ‌తిపై నారాయణ ప్ర‌శంస‌లు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని ప్లానింగ్‌ సూపర్‌ గా ఉందని నారాయణ కితాబిచ్చారు. తాము అమరావతిలో సెక్రటేరియట్‌ సహా అన్ని ప్రాంతాలు తిరిగామని ఆయన చెప్పారు. 60-70 ఏళ్ల వరకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందని ఆయన అన్నారు. అయితే ఏపీలో చంద్రబాబునాయుడు బలపడితే బీజేపీకి లాభం లేదని ప్రధాని మోడీ భావిస్తున్నారని, అందుకే నిదుల స‌మ‌స్య అని నారాయణ చెప్పారు. ఏపీకి సహకరిస్తే దానిని ఉపయోగించుకుని చంద్రబాబు బలపడతారని మోడీ భయపడుతున్నారని ఆయన అన్నారు. ఏపీలో తామే బలపడాలని మోడీ అనుకుంటున్నారని ఆయన చెప్పారు.

రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని, దళిత విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని, ఎంతోమంది చనిపోయారని నారాయ‌ణ మండిప‌డ్డారు. గోసంరక్షణ పేరుతో మతోన్మాదులు ఎంతోమందిని బలి తీసుకున్నారన్నారు. నల్లధనాన్ని స్వాధీనం చేసుకొని ఒక్కో కుటుంబానికి రూ. 15లక్షలు బ్యాంకు ఖాతాలో వేస్తానని చెప్పిన ప్రధాని మోడీ ఇప్పటివరకు ఎన్ని కుటుంబాలకు ఆ నగదు ఇచ్చారో బయటపెట్టాలన్నారు. ఒకవైపు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టిన బడాబాబులపై ఏమి చర్యలు తీసుకున్నారో వెల్లడింలని డిమాండ్ చేశారు. ఆర్‌బీఐ అనుమతి లేకుండా లక్షలకొద్దీ కొత్త 2వేల నోట్లు దొడ్డిదారిన బయటకు ఎలా వచ్చాయని నిలదీశారు. ఆర్‌బీఐ గవర్నర్ కార్పొరేట్ కంపెనీల ఏజెంటుగా మారారని కూడా ఆరోపించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కేంద్రాన్ని ప్రత్యేక హోదా గురించి అడిగే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. విద్య - ఆరోగ్యం - రైతుల సంరక్షణ విషయాల్లో దేశం వెనుకబడుతోందన్నారు.

దేశంలోనే క్షయ రోగ బాధితుల విషయంలో ఆంధ్ర రాష్ట్రం రెండో స్థానంలో ఉందని నారాయ‌ణ మండిప‌డ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 3,987 మంది క్షయ వ్యాధితో చనిపోయిన విషయం నిజమో, కాదో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. అన్ని విభాగాల్లోనూ అనినీతి పెరిగిందని, ఇటీవల ఏసీబీ దాడుల్లో దేవాదాయ శాఖ అధికారి ఇంట్లో రూ. 150కోట్లు, టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో రూ. 500కోట్లు ఇలా చెప్పుకుంటూపోతే ఈ మూడున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో ఏసీబీ దాడుల్లో రూ. 2,500 కోట్ల అక్రమ ఆస్తులను సీజ్ చేశారని ఆయన ప్రస్తావించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లపై కూడా ఇదేవిధంగా దాడులు నిర్వహిస్తే ఎవరి చరిత్ర ఏమిటో తెలుస్తుందని నారాయణ సూచించారు.