Begin typing your search above and press return to search.

గవర్నర్ వంకాయలు కోసుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   11 Jun 2016 9:24 AM GMT
గవర్నర్ వంకాయలు కోసుకుంటున్నారా?
X
పదునైన విమర్శలకు పెట్టింది పేరైన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నరు తాను ఏం చేయాలో అది చేయడం మానేశారని.. చూస్తుంటే ఆయన తన బాధ్యతలు మరిచి వంకాయలు కోసుకుంటున్నట్లుగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పద్ధతిపై తీవ్ర విమర్శలు చేస్తూ వారిని దారిన పెట్టాల్సిన గవర్నరు కూడా చేష్టలుడిగి చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఆ క్రమంలో ఆయన గవర్నరుపై ఇలా పరుషమైన కామెంట్లు చేశారు.

ఇటు తెలంగాణాలో - అటు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులు పరిపాలన మానేసి రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని నారాయణ మండిపడ్డారు. ఆపరేషన్ ఆకర్ష తప్ప పాలన అనేది మర్చిపోయారని.. వారి వలలో పడి పార్టీలు మారుతున్నవారంతా బడుద్ధాయిలంటూ సీరియస్ అయ్యారు. ఏపీలో అధికార టీడీపీ సైకిలెక్కుతున్నవారు, ఇక్కడ గులాబీ కండువా కప్పుకొంటున్న బడుద్ధాయిలంతా బయటకి వచ్చి తెగ కబుర్లు చెబుతున్నారని... ప్రజల కోసం - నియోజకవర్గం కోసం - బంగారు తెలంగాణా - స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం పార్టీ మారుతున్నామని చెబుతున్నారని.. అదంతా ఒట్టి మాటలేనని మండిపడ్డారు.

ముఖ్యమంత్రులిద్దరూ అడ్డగోలుగా దోచుకుంటున్నారని కూడా నారాయణ ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఉన్న నిర్మాణాలను కూలగొట్టి - తవ్విన కాలువలు పూడ్చి కొత్త నిర్మాణాల పేరుతో దోచుకుంటున్నారని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణంలో హోల్ సేల్ గా వ్యాపారం మొదలెట్టేశారని తీవ్రంగా ఆరోపించారు. ఇరుగు పొరుగు రాష్ర్టాల పాలకులుగా ఇద్దరు సీఎం గొడవ పడుతున్నారని.. ఇద్దరినీ దారిన పెట్టాల్సిన గవర్నరు ఆపని చేయలేకపోతున్నారని విమర్వించారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులుంటే గవర్నర్ గారు వంకాయలు తరుగుతున్నారా.. అంటూ తీవ్రస్థాయిలో నిలదీశారు.