Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు నేతలు కొత్త పెళ్లికొడుకులా..?

By:  Tupaki Desk   |   1 Oct 2015 11:59 AM GMT
ఆ ముగ్గురు నేతలు కొత్త పెళ్లికొడుకులా..?
X
ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ - తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు - కల్వకుంట్ల చంద్రశేఖర రావులు కొత్త పెళ్లికొడుకుల్లా ఫీలవుతున్నారని సీసీఐ నేత నారాయణ సెటైర్లు వేస్తున్నారు. ఆ ముగ్గురు కూడా కొత్త పెళ్లి కొడుకుల్లా హాయిగా టూర్లు తిరుగుతున్నారంటూ ఆయన ఎద్దేవచేశారు.

ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని భ్రష్టు పట్టిస్తోందంటూ నారాయణ మండిపడ్డారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు మునుపెన్నడూ లేనంతగా అత్యధిక స్థాయికి చేరిందని ప్రభుత్వం వీటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ నారాయణ ఆగ్రహించారు.

ఏపీ, తెలంగాణల్లో ముఖ్యమంత్రులు ప్రజాసమస్యలను గాలికొదిలేసి ఫారిన్ టూర్లు చేస్తున్నారని నారాయణ మండిపడ్డారు. ఏపీ, తెలంగాణల్లో రైతులు, పేదలకు ఉన్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. మొత్తానికి కేంద్రంలో మోడీ... ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ లు ముగ్గురూ కొత్త పెళ్లికొడుకుల్లా తయారయ్యారన్నారు. అయితే... నారాయణ ఏ ఉద్దేశంతో అన్నారన్నది పక్కనపెడితే... ఒకరకంగా ముగ్గురూ కొత్త పెళ్లికొడుకులే అని చెప్పొచ్చు. మొట్టమొదటిసారిగా ప్రధాని అవడంతో మోడీ... ప్రత్యేకంగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ లకు ఆ పదవులు పూర్తిగా కొత్తవే. ఈ లెక్కన వారు కొత్త పెళ్లికొడుకులే. ఇక చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాకపోయినా రాజధాని కూడా లేని కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో ఆయన కూడా కొత్త పెళ్లికొడుకనే అనుకోవాలి.