Begin typing your search above and press return to search.

మోడీ ముందు మూడు కోతులు..!

By:  Tupaki Desk   |   11 Jun 2017 7:12 AM GMT
మోడీ ముందు మూడు కోతులు..!
X
సంద‌ర్భం ఏదైనా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంలో ముందుండే సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టరు కె నారాయణ తాజాగా త‌న‌దైన శైలిలో ఒకింత వివాదాస్ప‌ద కామెంట్లు చేశారు. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ - ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ముగ్గురు మూడు కోతుల వంటివార‌ని నారాయ‌ణ వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో విలేరురులతో మాట్లాడుతూ కేంద్ర - రాష్ట్రప్రభుత్వాలు ఏర్పడి మూడేళ్లు అయిన నేపధ్యంలో తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అప్పట్లో జాతిపిత‌ గాంధీ చెప్పిన సూక్తిలో మూడుకోతులు మాదిరిగా ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏపీ ప్రతిపక్షనేత జగన్‌ లు తయారయ్యారంటూ నారాయ‌ణ‌ విమర్శించారు. ఒకరు అన్యాయాలపై మాట్లాడరని, మరొకరు ఏం జరుగుతుందో చూసే పరిస్దితిలో లేరని, మరొకరికి ఏది వినపడదని వారి ముగ్గుర్ని ఉద్దేశించి నారాయ‌ణ ఎద్దేవా చేశారు.

కేంద్రంలో మోడీ - రాష్ట్రంలో బాబు గడపదాటించని హామీలతో గడిపేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఒక్క హామీని కూడా పూర్తిగా అమలుచేయకుండా ఆర్భాటపు ప్రకటనలతోనే నెట్టుకొచ్చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నల్లధనం పేరు చెప్పి నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకుందని, ఇది కేవలం ఉన్న నల్లధనాన్ని తెల్లడబ్బుగా మార్చుకునేందుకు కార్పొరేట్లకు ఎంతగానో ఉపయోగపడిందని విమర్శించారు. అంతకుముందు ఎటిఎంలు ఉండేవని, ఇప్పుడు వాటి స్థానంలో పేటీఎంలు వచ్చేశాయని విమర్శించారు. ప్రజల్లో మోడీ పట్ల ఏదో చేస్తారన్న నమ్మకమే బలహీనతగా మారిందని చెప్పారు. మూడేళ్లలో కుంభకోణాలరహిత ప్రభుత్వాన్ని అందించామని మోడీ చెపుతున్నారని, అయితే కాంగ్రెస్ హయాంలో వాళ్లు చిలకొట్టుడు కొడితే ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో హోల్‌ సేల్ అవినీతి జరుగుతోందని, దానికి నోట్ల రద్దే నిదర్శనమని నారాయ‌ణ ఆరోపించారు.

సామాన్య, మధ్యతరగతి విషయంలో నిర్దయగా వ్యవహరించే ప్రభుత్వాలు కార్పొరేట్లకు మాత్రమే 13.50లక్షల కోట్ల రూపాయల మేరకు రాయితీలు ఇచ్చారని నారాయ‌ణ‌ చెప్పారు. ఇక జిఎస్‌ టి అమలుచేయనున్నారని, దీంతో పన్నుల వ్యవస్థను మరింత విస్తరించి అధిక ఆదాయాన్ని పొందటమే లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. చివరకు హిందుత్వానికి పెద్దపీట వేసి వ్యవహారాలు నడిపిస్తున్నారని, దానిలో భాగంగానే ఘర్‌ వాపసీ అంటూ ఇతర మతాల్లో ఉన్నవారిని హిందూమతంలోకి తీసుకురావాలని ప్రయత్నించటం సరికాదన్నారు. అంతగా చిత్తశుద్ది ఉంటే హిందూ ధర్మానుసారం వివాహం చేసుకున్న భార్యను ఘర్‌వాపసీ తీసుకువెళ్లాలని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో జరుగుతున్న దురన్యాయాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పశువధ నిషేధాన్ని తెరపైకి తీసుకువచ్చారని, దీనివల్ల ఆర్ధికవ్యవస్ధ ఎంతగానో దెబ్బతింటుందని చెప్పారు. పశువధ నిషేధించిన కేంద్రం పశువులకు ఓల్డ్ ఏజ్ హోంలు పెడుతుందా అంటూ ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో మూడేళ్లు గడిచాక ముఖ్యమంత్రి చంద్రబాబు బీద అరుపులు ఆరుస్తున్నారన్నారు. హోదా ఇచ్చేది లేదని కేంద్రం చెప్పేస్తే దానిపై కనీసం పోరాటం కూడా లేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారన్నారు. అసెంబ్లీలో జగన్ ఛాంబర్‌ లోకి నీళ్లు వెళ్లటం కన్నా పెద్దసమస్యలు ఏమి రాష్ట్రంలో వారికి కన్పించకపోవటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రతిపక్షనేత జగన్ కూడా మోడీ వద్దకు వెళ్లి మోకరిల్లారని, రాష్టప్రతి ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో అభ్యర్ధిని ఎన్నుకోవాలని చెప్పేంత అహంభావం ఆయనకు ఎందుకని ప్రశ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/