Begin typing your search above and press return to search.

సీపీఐ నారాయణ సలహా తీసుకుంటే ఆర్థిక మాంద్యం తగ్గిపోతుందట!

By:  Tupaki Desk   |   17 Oct 2019 2:30 PM GMT
సీపీఐ నారాయణ సలహా తీసుకుంటే ఆర్థిక మాంద్యం తగ్గిపోతుందట!
X
దేశంలో ఆర్థిక మాంద్యం రోజురోజుకీ పెరుగుతుండడం.. కేంద్రం ఉద్దీపన చర్యలు చేపడుతుండడం తెలిసిందే. ఆర్థిక మాంద్యం ప్రమాదకర స్థాయిలో లేదని - భారత్ దీన్నుంచి త్వరలో బయటపడేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని కేంద్రం పదేపదే చెబుతున్నా విపక్షాలు మాత్రం సందు దొరికితే చాలు ఉతికి ఆరేస్తున్నాయి. విపక్షాలకు తోడు తాజాగా ఈ ఏటి ఆర్థిక శాస్త్ర నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీ కూడా దీనిపై కేంద్రాన్ని విమర్శించారు. నోబెల్ బహుమతితో ప్రపంచమంతా గుర్తించిన ఆర్థికవేత్తగా కొనియాడుతున్న అభిజిత్ బెనర్జీ కూడా కేంద్రం విధానాలను తప్పుపట్టడంతో విపక్షాలకు భారీ ఆయుధమే లభించింది.

మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ సైతం దేశ ఆర్థికస్థితిని విమర్శిస్తూ ఓ పత్రికలో వ్యాసం రాయడం మరింత కలకలం రేపింది. ఇలాంటి పరిస్థితిలో ఓ తెలుగు చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలోనూ విపక్ష నేతలు మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను ఎండగట్టారు.

ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేత సత్యమూర్తి.. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఉన్న నేపథ్యంలో ప్రధాని మోదీ దాన్ని తగ్గించడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నార’’ని చెప్పగా అదే కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జాతీయ నేత నారాయణ మాత్రం కేంద్రాన్ని ఎండగట్టారు. ఇప్పుడు అభిజిత్ బెనర్జీయే కాదు గతంలో అమర్త్యసేన్‌ కు నోబెల్ బహుమతి వచ్చిన తరువాత ఆయన కూడా భారత ఆర్థిక విధానాలపై విమర్శలు చేశారని - అయినా వారు భయపెట్టినట్లు భారత ఆర్థిక వ్యవస్థకు ఏమీ కాలేదని సత్యమూర్తి అన్నారు.

సీపీఐ జాతీయ నేత నారాయణ మాట్లాడుతూ.. 2008లో కూడా ఆర్దిక మాంద్యం వచ్చిందని - అప్పడు యూపీఏ ప్రభుత్వం తమ పార్టీ మద్దతుతో మాంద్యాన్ని తగ్గించగలిగిందని చెప్పుకొచ్చారు. దేశంలో కార్మికులంతా ఉద్యమాలు చేస్తున్నారని - స్వయంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ చెప్పిన విషయాలు వాస్తవమేనన్నారు. మోదీ ప్రభుత్వం ప్రైవేటు సెక్టార్ - కార్పొరేట్ కంపెనీలను పెంచి పోషిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నీరుగారుస్తోందని నారాయణ విమర్శించారు. ఈ దేశానికి ప్రమాదం ఏదైనా వచ్చిందంటే అది కేవలం మోదీ వల్ల మాత్రమేనంటూ ఆరోపించారు సీపీఐ నేత నారాయణ. దేశంలో ప్రస్తుతం ఆర్ధిక మాంద్యం ఉన్నవిషయాన్ని స్వయంగా 20 రోజుల క్రితం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారని - దీనికి జీఎస్టీ వసూళ్లకు సంబంధించిన పట్టికను గమనిస్తే దీన్ని అర్ధం చేసుకోచ్చన్నారు.

చర్చలో పాల్గొన్న ఆర్థికరంగ నిపుణుడు సాయిబాబా మాట్లాడుతూ జీఎస్టీ వసూళ్లలో తగ్గుదల కూడా ఆర్థిక మాంద్యానికి సూచికని చెప్పారు. ఏప్రిల్‌లో జీఎస్టీ అత్యధికంగా వసూలు కాగా సెప్టెంబర్ వచ్చే సరికి 20 శాతం తగ్గిపోయిందన్నారు.ప్రజల్లో కొనుగోలుశక్తి తగ్గిపోవడమే దీనికి కారణమన్నారు. ధరల పెరుగుదల ఆర్థిక మాంద్య ఫలితమేనని ఆయన సూత్రీకరించారు.