Begin typing your search above and press return to search.

బాబును జనం నమ్మరు....నారాయణ చెబుతున్న నిజం

By:  Tupaki Desk   |   28 Aug 2022 2:30 AM GMT
బాబును జనం నమ్మరు....నారాయణ చెబుతున్న నిజం
X
చంద్రబాబుని జనాలు అసలు ఏ కోశానా నమ్మరట. ఆయనలో ఏ రకమైన రాజకీయ విధాన పరమైన నిలకడ లేదట. ఆయన నిన్న ఒకలా నేడు మరోలా ఉంటున్నారుట. ఇదీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అంటున్న మాటలు. బాబుని అసలు ఎందుకు నమ్మాలీ అని కూడా అంటున్నారు. 2019 ఎన్నికల ముందు ధర్మ పోరాటం అంటూ మోడీ మీద కత్తి ఎత్తిన చంద్రబాబు ఈ రోజు ఫుల్ గా చేయి దించేశారని సెటైర్లు వేశారు.

ఒక విధంగా బాబు బీజేపీకి సరెండర్ అయిపోయారని ఆయన అన్నారు. చంద్రబాబు బీజేపీ పొత్తు కోసం తహతహలాడుతున్నా ఆయనది అంతా వన్ సైడ్ లవ్ మాత్రమే అని తీసిపారేశారు. అంటే మోడీ వైపు నుంచి ఎలాంటి పాజిటివ్ యాక్షన్ ఉండదని నారాయణ గట్టిగా నమ్ముతున్నారన్న మాట.

అయితే బాబులో నిలకడలేని రాజకీయ తత్వాన్ని ఆయన గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఒకనాడు తిట్టి ఇపుడు పంచన చేరడానికి ఆరాటమేంటి బాబూ అని కూడా నిగ్గదీస్తున్నారు. బీజేపీ వారితో రాసుకుని పూసుకుని తిరగాలన్న ఉబలాటం తమరికి ఎందుకు బాబూ అని నారాయణ ఎద్దేవా చేశారు.

మొత్తానికి చూస్తే నారాయణకు బాబు మీద మిత్ర ప్రేమ ఉందా లేక ప్రత్యర్ధిగా చూస్తున్నారా అన్నది తెలియడంలేదు కానీ బాబు బీజేపీతో చేయి కలపాలని చూడడం మాత్రం ఆయనకు ఏ మాత్రం నచ్చడంలేదు అంటున్నారు. చంద్రబాబు తమతో ఉంటారు. తామంతా కలసి 2024 ఎన్నికల్లో ఒక కూటమిగా వెళ్ళాలని సీపీఐ నేతలు భావించారు. కానీ చంద్రబాబు మాత్రం ఇప్పటిదాకా సీపీఐ నేతలను పక్కన పెట్టుకుని అమరావతి రాజధాని సహా అనేక ఉద్యమాలను చేశారు.

అయితే ఇపుడు ఎన్నికలు సమీపిస్తూండడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కంటే ఎవరూ బలమైన తోడు లేరు, కారు అని నిశ్చయించుకుని ఆ వైపుగా సాగుతున్నారు. ఈ మధ్యనే ఢిల్లీ వెళ్ళి మోడీతో కరచాలనం చేసి వచ్చిన చంద్రబాబు బీజేపీతో బంధం మళ్లీ పెనవేసుకుపోతుందని గంపెడాశతో ఉన్నారు. అందుకే ఆయన కామ్రేడ్స్ వైపు కన్నెత్తి చూడడంలేదు. మరి ఏపీలో చూస్తే సీపీఐకి దోస్త్ ఎవరూ లేకుండా పోయారు. తెలంగాణాలో అధికార టీయారెస్ తో పొత్తు కలిపిన సీపీఐ కి ఏపీలో చంద్రబాబే సరైన నేస్తం అని అనుకున్నారు.

అటు జగన్ అయితే సీపీఐ వారితో దోస్తీ చేయరు. పైగా ఆయన ఒంటరి పోరాటం చేస్తారు. ఇక జగన్ కూడా బీజేపీతో పరోక్ష దోస్తీతో ఉన్నారు. అలాగే జనసేన కూడా 2019 ఎన్నికలలో కమ్యూనిస్టులతో కలసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళింది. తీరా దారుణంగా ఓడాక బీజేపీ వైపు వెళ్ళి జట్టు కట్టింది. ఇలా చూస్తే కనుక ఏపీలో బాబుతోనే అంతా అనుకున్న సీపీఐకి ఆయన బీజేపీ వైపుగా వెళ్ళడంతో తమ పరిస్థితి ఏంటి అన్న ఆలోచన కూడా వచ్చి ఉండాలి.

ఈ కారణాలతోనే బాబుని ఎవరూ నమ్మరు అని అంటున్నారు. మరి ఇదే బాబు ఎన్నో సార్లు బీజేపీ వైపు వెళ్ళి కమ్యూనిస్టుల వైపు వచ్చారు కదా. అపుడు నమ్మిన జనాలు ఇపుడు ఎందుకు నమ్మరు అన్నది కూడా ఒక ప్రశ్న. ఏది ఏమైనా చంద్రబాబు ది వన్ సైడ్ లవ్ అంటున్నారు. జనాలు నమ్మరు అంటున్నారు. ఒక విధంగా ఇవి హెచ్చరికలా సూచనలా లేక శాపనార్ధాలా . ఏమో బాబుకు మిత్రుడి కానీ మిత్రుడు నారాయణే దీనికి జవాబు చెప్పగలరు.