Begin typing your search above and press return to search.

చంద్రబాబు చెంతన నారాయణ నారాయణ

By:  Tupaki Desk   |   11 April 2016 9:15 AM GMT
చంద్రబాబు చెంతన నారాయణ నారాయణ
X
చంద్రబాబు మంత్రి వర్గంలో ఇప్పటికే ఒక నారాయణ ఉన్నారు. టీడీపీలో చేరి మంత్రి పదవి కొట్టేసి ఆ తరువాత ఎమ్మెల్సీగా ఎన్నికైన మంత్రి పి.నారాయణ చంద్రబాబుకు అత్యంత నమ్మకస్థుల్లో ఒకరు. ఇప్పుడు మరో నారాయణ కూడా చంద్రబాబుతో కలిసి నడవాలని అనుకుంటున్నారట. ఆ రెండో నారాయణ ఇంకెవరో కాదు - సీపీఐ నేత నారాయణ. ఇటీవల కాలంలో చంద్రబాబుపై విమర్శలు దాదాపుగా మానుకున్న ఆయన రీసెంటుగా టీడీపీ - సీపీఐలు కలవాలన్న ఉద్దేశంలో వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతాయా... కమ్యూనిస్టుల్లో ఒకరైన సీపీఐ టీడీపీతో కలిసి నడవాలని అనుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సీపీఐ నేత నారాయణ.. చంద్రబాబు పై ప్రేమను పరోక్షంగా బయటపెట్టుకున్నారు. చంద్రబాబు బీజేపీ ని విడిచిపెట్టి కమ్యూనిస్టులతో కలసి పోరాడాలని పిలుపు నిచ్చారు. బీజేపీ వదిలిపెట్టమని బాగానే ఉంది కానీ .. కమ్యూనిస్టులతో జతకట్టమని కోరడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు రైతులు - మహిళలు - పేదలు పట్ల ఎంతో కరుణతో పాలిస్తున్నారు.. కేవలం బీజేపీతో జత కట్టడం వల్లే బాబు చెడ్డపేరు తెచ్చుకుంటున్నారన్న ఉద్దేశం నారాయణలో కనిపిస్తోంది. అయితే... సీట్ల పాలిటిక్సు చేస్తున్న చంద్రబాబు ఏమాత్రం బలం లేని సీపీఐతో కలవడానికి ఇష్టపడతారా అన్నది అనుమానమే. అయితే.... రాజధాని స్థలాలపై వివాదాలు, రాష్ట్రంలో ఇతర అంశాలపై ఉద్యమాలు రాకుండా నిరోధించేందుకు వామపక్షాలను కలుపుకొని పోవడానికి చంద్రబాబు సానుకూలత చూపినా చూపొచ్చన్న వాదనా వినిపిస్తోంది. మొత్తానికైతే నారాయణ మాత్రం చంద్రబాబు పట్ల ఆసక్తిగానే ఉన్నట్లు అర్థమవుతోంది.