Begin typing your search above and press return to search.

మూడు రాజధానులు అంటే నవ్వుతున్నారన్న నారాయణ

By:  Tupaki Desk   |   16 Jan 2020 12:04 PM GMT
మూడు రాజధానులు అంటే నవ్వుతున్నారన్న నారాయణ
X
ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ గురించి కానీ.. దాని ప్రయోజనాల గురించి అస్సలు పట్టని కామ్రేడ్ నారాయణ ఇటీవల కాలంలో ఏపీకి సంబంధించిన విషయాల్ని ఎక్కువగా మాట్లాడుతున్నారు. నిజమే.. తెలంగాణలో ఆయన ఎంత మాట్లాడినా ప్రయోజనం లేకపోగా.. ఆయన వ్యాఖ్యల్ని ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ప్రభుత్వమే కాదు.. ప్రజలు సీరియస్ గా తీసుకోవటం లేదు. ఆయన కానీ ఆయన పార్టీ కానీ పిలుపిస్తే రోడ్ల మీదకు వస్తున్నోళ్లే లేరు. ఇలాంటివేళ.. తెలంగాణను వదిలి ఏపీపైన వ్యాఖ్యల హడావుడి చేస్తున్న ఆయన..తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల వ్యవహారం మీద రియాక్ట్ అయ్యారు.

అమరావతి రాజధాని రైతులు చేస్తున్న పోరాటం జాతీయ స్థాయికి చేరుకుందని.. మూడు రాజధానులు ఏమిటంటూ అక్కడివారు నవ్వుతున్నారన్నారు. మందడంలో రైతులు చేస్తున్న మహాధర్నాకు సంఘీభావం తెలియజేసేందుకు వచ్చిన ఆయన.. రైతుల దీక్షలు.. ఆందోళనలకు తాము పూర్తిస్థాయి మద్దతు ప్రకటించినట్లుగా పేర్కొన్నారు.

రాజధాని ప్రాంతంలో ప్రజల కంటే పోలీసులు ఎక్కువగా ఉన్నారన్న ఆయన.. ఒక్కో వ్యక్తికి ముగ్గురు పోలీసులు ఉన్నారన్నారు. వీధుల్లో ఎక్కడా కోట్లాటలు జరగటం లేదని.. గొడవపడేవారంతా ఇప్పుడు అసెంబ్లీకి చేరారంటూ ఎద్దేవా చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే మహిళలపై పోలీసుల దాడులేమిటన్న ఆయన.. రైతుల వద్ద ఏమైనా బాంబులు.. మారణాయుధాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించిన ఆయన.. మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

మూడురాజధానులు చేస్తే తమకు అభ్యంతరం లేదు కానీ.. ముఖ్యమంత్రి జగన్ తన పదవికి రాజీనామా చేసి.. మూడు రాజధానుల అంశాన్ని మేనిఫేస్టోలో చేర్చి ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం తాము మూడు రాజధానుల గురించి ఏమీ మాట్లాడమని.. తమ మద్దతు ఉంటుందన్నారు. అలా కాకుండా మూడు ముక్కలు చేసే హక్కు సీఎం జగన్ కు లేదన్నారు.

విశాఖకు ఉద్యోగుల్ని తరలించేందుకు రూ.2లక్షల ఖర్చు అవుతుందన్న ఆయన.. అమరావతి నడిబొడ్డున 50వేల ఎకరాల భూమి ఉందన్నారు. 12 వేల ఎకరాల భూమిని డెవలప్ మెంట్ కు ఇస్తే.. పైసా ఖర్చు లేకుండా రాజధాని నగరాన్ని నిర్మించొచ్చన్న నారాయణ.. పోలీసులు.. గన్ మెన్లు లేకుండా మంత్రులు..ఎమ్మెల్యేలు తిరగగలరా? అంటూ సవాల్ విసిరారు.