Begin typing your search above and press return to search.

సీపీఐ నారాయణ నోటి వెంట ‘బూతుమాటల’ బాగోతం

By:  Tupaki Desk   |   8 March 2022 12:35 PM GMT
సీపీఐ నారాయణ నోటి వెంట ‘బూతుమాటల’ బాగోతం
X
బిగ్ బాస్ హౌస్ ను 'బ్రోతల్' హౌస్ అంటూ పెద్ద దుమారం రేపిన సీపీఐ నాయకుడు నారాయణ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్య చేసి వార్తల్లో నిలిచారు. రోజురోజుకు దిగజారి మాట్లాడుతున్న నారాయణ తీరు చూసి అంతా ముక్కునవేలేసుకున్నారు. చివరకు సొంత పార్టీ వాళ్లే నారాయణ విమర్శలను అసహ్యించుకుంటున్న పరిస్థితి నెలకొంది.

ఒకప్పుడు కమ్యూనిస్టు నాయకుల మాటలకు విలువ ఉండేది. వారు ఏది మాట్లాడినా ఒక కన్ స్ట్రక్టివ్ గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారన్న పేరుంది. నారాయణ లాంటి నేతల వల్ల ఇప్పుడు వామపక్ష పార్టీలంటేనే అసహ్యమేసేలా వీరి వ్యాఖ్యలు ఉంటాయి.

తాజాగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పై నారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఏపీ గవర్నర్ ను 'బ్రోకర్, హెడ్ క్లర్క్' అంటూ తిట్టిపోయడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇప్పటికే బిగ్ బాస్ రియాల్టీ షోపై కూడా నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బోత్రల్ హౌస్ అని.. హోస్ట్ నాగార్జునను తీవ్రంగా దూషించాడు. నాగార్జున అంటే తనకు అసహ్యం కలుగుతోందన్నాడు.

ఈరోజు ఏకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బ్రోకర్ గా ఏపీ గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ కు గవర్నర్ హెడ్ క్లర్క్ అంటూ పనిచేస్తున్నట్టుందన్నారు. గవర్నర్ వయసు రీత్యా అత్యంత సీనియర్ రాజకీయ నేత. హుందాగా ప్రవర్తిస్తుంటారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న భిశ్వభూషణ్ రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటారు. ఏపీ గవర్నర్ గా ఆయనపై ఎలాంటి మచ్చ లేదు.

కానీ తాజాగా నారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. జగన్ చెప్పిన చోటల్లా భిశ్వభూషణ్ సంతకం చేస్తున్నారని.. భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఏకంగా గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించిందని విమర్శించారు. ఈసీని తొలగించే అధికారం పార్లమెంట్ కు తప్ప ఎవరికీ లేదని.. కానీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తొలగించే ఫైల్ పై గవర్నర్ ఎలా సంతకం చేశామని విమర్శించారు.జగన్ కు వంతపాడుతున్న గవర్నర్ పై నారాయణ మండిపడ్డారు.

ఇక నారాయణ వ్యాఖ్యలపై రాజకీయ పార్టీల నేతము, నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఆయన నోటి దురుసును తగ్గించుకోవాలని హితవు పలుకుతున్నారు.