Begin typing your search above and press return to search.

వృద్ధ కామ్రెడ్ : స్పూర్తివంతంగా ఉండాల్సిన చోట...?

By:  Tupaki Desk   |   20 July 2022 10:30 AM GMT
వృద్ధ కామ్రెడ్ : స్పూర్తివంతంగా ఉండాల్సిన చోట...?
X
ఈ దేశంలో వామపక్షాలకు ఎంతో చరిత్ర ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో కాంగ్రెస్ కి ఎదురు నిలిచి జాతీయ స్థాయిలోనూ చాలా రాష్ట్రాలలలోనూ కీలకమైన పాత్ర పోషించిన సందర్భం ఉంది. ఇక ఈ దేశంలో ఎన్నో ప్రజోపయోగమైన చట్టాలు వచ్చాయి అంటే కామ్రెడ్స్ పోరాటాల వల్లనే అని వేరేగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇక ఈ దేశంలో పేదల గురించి బడుగుల గురించి మాట్లాడేది వారి పక్షాన ఎక్కువగా పోరాడేది కామ్రెడ్స్ అనే చెప్పాలి.

అలాంటి కామ్రెడ్స్ గత కొంతకాలంగా తగ్గిపోతున్నారు. వారి సిద్ధాంతాలకు ఎంతో బలం ఉంది. కానీ దాన్ని తుచ తప్పకుండా ఆచరించే వారి ఆలోచనల్లో మార్పు వస్తోంది అన్న విమర్శలు ఉన్నాయి. ఎవో కొన్ని సీట్ల కోసం బూర్జువా పార్టీలతో కలసిపనిచేయడం వల్లన ఆ భావజాలం వారికి కూడా వంటబడుతోందా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయంటున్నారు.

ఇక సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చాలా సీనియర్ నేత. ఆయన జీవితం అంతా వామపక్ష పోరాటానికే అంకితం చేశారు. ఆయన కంటే వెనక వచ్చిన వారు అధికార వైభోగాలను చూశారు. కానీ నారాయణ మాత్రం నిబద్ధత కలిగిన నాయకుడిగానే ఉంటూ వచ్చారు. అలాంటి నారాయణ స్పూర్తివంతంగా యువతకు నిలవాలి. అయితే ఆయన తన వాచాలత్వం వల్లనే తరచూ విమర్శల పాలు అవుతున్నారు అనే అంటున్నారు.

లేకపోతే మెగాస్టార్ గా కోట్లాది మందితో నీరాజనాలు అందుకునే కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి మీద దారుణమైన కామెంట్స్ చేయడాన్ని ఎలా చూడాలి. చిరంజీవి అల్లూరి జయంతి సభకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలిస్తేనే వెళ్లారు తప్ప తానుగా వెళ్లలేరు. ఇక ఆయన టాలీవుడ్ కి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన వెళ్తే తప్పు కూడా కాదు, అదే సమయంలో ఆయన ఊసరవెల్లి అని కూడా నారాయణ అన్నారు. చిరంజీవి కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేశాక రాజకీయాలకే స్వస్తి పలికారు. ఆయన ఏ పార్టీ వైపు కూడా తొంగి చూడలేదు.

ఆయన నిజంగా రాజకీయ వ్యామోహంతోనే ఉంటే ఈపాటికి ఆయన పదవులు కూడా అందుకునేవారు. ఈ రోజుకీ ఆయన కోరితే పదవులు ఇచ్చే పార్టీలు చాలానే క్యూ కడతాయి. మరి అలాంటి చిరంజీవిలో ఊసరవెల్లి ఎలా నారాయణకు కనిపించారో అర్ధం కాని పరిస్థితి. ఇక జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తన రాజకీయమేదో ఆయన చేసుకుంటున్నారు. ఆయన ఎపుడెలా ఉంటారో తెలియదు అని నారాయణ విమర్శించారని వార్తలు వచ్చాయి.

ఇదే జనసేన వామపక్షాలతో పొత్తు పెట్టుకుంది కదా. అలాగే ప్రజారాజ్యం కూడా అప్పట్లో వామపక్షాలతో దోస్తీ చేసింది కదా. ఏది ఏమైనా విమర్శలు చేయవచ్చు. అది సిద్ధాంతాల ప్రాతిపదికన ఉండాలి తప్ప వ్యక్తిగతంగా ఉండరాదు. వామపక్ష వాదులు ఎపుడూ వ్యక్తిగత విమర్శలు చేసే పరిస్థితి ఉండదు, కానీ నారాయణ మాత్రం ఇలాంటివి మరచి విమర్శలు తరచూ చేస్తూ తిరిగి నాలుగు మాటలు అనిపించుకోవడమే విచారించతగిన విషయం అనే అంటున్నారు.

ఈ రోజుకీ చాలా మంది నాయకుల కంటే కూడా సీపీఐ నాయకుడిగా నారాయణ ఎన్నో పోరాటాలు చేశారు. పేదల పక్షాన ఉన్నారు. తన జీవితాన్ని అంకితం చేస్తున్నారు. ఆయన అంటే అందరికీ గౌరవ భావం ఉంది. ఆయన కూడా కువిమర్శలు పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద పోరాడితే బాగుంటుంది. అంతే కాదు సీపీఐ భావజాలాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళి మళ్ళీ పూర్వకాలం నాటి బలాన్ని తీసుకువస్తే ఈ దేశంలో పేదలు సంతోషిస్తారు.