Begin typing your search above and press return to search.

అనుకున్నంతా అయ్యింది..టీఆర్ ఎస్ కు హ్యాండిచ్చేసిన సీపీఐ

By:  Tupaki Desk   |   14 Oct 2019 4:17 PM GMT
అనుకున్నంతా అయ్యింది..టీఆర్ ఎస్ కు హ్యాండిచ్చేసిన సీపీఐ
X
నిజమే... అనుకున్నంతా అయ్యింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ వ్యవహరిస్తున్న వైఖరిని మార్చుకోకపోతే... హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతు ఉపసంహరిస్తామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన వామపక్ష పార్టీ సీపీఐ... అన్నంత పనీ చేసింది. సమ్మెపై కేసీఆర్ వైఖరిలో ఎంతమాత్రం మార్పు కనిపించని నేపథ్యంలో కాసేపటి క్రితం సీపీఐ ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ ఎస్ కు ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకున్నట్లు సీపీఐ సంచలన ప్రకటన చేసింది. ఫలితంగా ఇప్పటికే హుజూర్ నగర్ లో ఎదురీదుతున్న టీఆర్ ఎస్ కు భారీ షాక్ తగిలిందనే చెప్పక తప్పదు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని టీఆర్ ఎస్ ప్రభుత్వానికి సీపీఐ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు ఈనెల 13వ తేదీని గడువుగా విధించింది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి గానీ, టీఆర్ ఎస్ నుంచి గానీ ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అధ్యక్షతన సీపీఐ రాష్ట్ర కమిటీ సూర్యాపేటలో సోమవారం సాయంత్రం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు - కార్మికుల సమస్యలు - ప్రభుత్వ విధానాలపై విస్తృతంగా చర్చించింది. సుధీర్ఘ చర్చల అనంతరం టీఆర్ ఎస్‌ కు మద్దతు ఉపసంహరించుకోవాలని మెజార్టీ కార్యవర్గం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో హుజూర్‌ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్‌ కు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వ వైఖరి వల్లే టీఆర్ ఎస్ కు మద్దతు ఉపసంహరణకు కారణమని సీపీఐ తన ప్రకటనలో పేర్కొంది. ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించే బదులు ప్రభుత్వం విద్వేషపూరితంగా వ్యవహరిస్తోందని ఓ రేంజిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. 48వేల మంది కార్మికులను తొలగించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించింది. ఆర్టీసీ ఉద్యమంలో అగ్రభాగాన ఉండాలని నిర్ణయించామని పేర్కొంది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే దానిపై త్వరలో ప్రకటన విడుదల చేస్తామని తెలిపింది. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ చర్చలకు పిలవాలని సీపీఐ డిమాండ్ చేసింది. మొత్తంగా హోరాహోరీగా సాగుతున్న హుజూర్ నగర్ బైపోల్స్ లో టీఆర్ ఎస్ కు గట్టి ఎదురుదెబ్బే తగిలిందని చెప్పక తప్పదు.