Begin typing your search above and press return to search.

అమిత్ షాకు నల్ల జెండాల స్వాగతం.. ?

By:  Tupaki Desk   |   8 Nov 2021 9:41 AM GMT
అమిత్ షాకు నల్ల జెండాల స్వాగతం.. ?
X
ఆయన దేశానికి హోం మంత్రి. పవర్ ఫుల్ ప్లేస్ లో ఉన్న లీడర్. మోడీ తరువాత ఆయనే అంటారు. ఢిల్లీకి వెళ్ళిన నాయకులు అంతా ఆయన అపాయింట్మెంట్ కోసం అర్రులు చాస్తారు. అలాంటి అమిత్ షా ఏరి కోరి ఆంధ్రాను ఎంచుకుని మరీ ఢిల్లీ కొటను దిగి రాబోతున్నారు. పవిత్ర తిరుపతి క్షేత్రం వేదికగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యంత కీలకమైన భేటీని ఆయన ఈ నెల 14న నిర్వహించబోతున్నారు. అమిత్ షా ఏపీ టూర్ మీద రాజకీయ వర్గాల్లో ఆసక్తి బాగా ఉంది. చాలా కాలానికి వస్తున్న అమిత్ షా ఏపీకి ఏం తెస్తారు, ఏమేమి వరాలు ఇవ్వబోతున్నారు అన్నది సగటు జనం ఆలోచన అయితే ఆయన మావాడే అని నిరూపించుకోవడానికి ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఆరాటపడుతున్నాయి. ఇందులో కాంగ్రెస్ కమ్యూనిస్టులకు మాత్రమే మినహాయింపు ఉంది.

ఇవన్నీ పక్కన పెడితే అమిత్ షా ఏపీకి ఊరకే రారు, వచ్చి ఖాళీగా వెళ్లిపోరు. ఆయన రాజకీయ‌ వ్యూహాలు ఆయనకు ఉంటాయి. ఆయన ఏ బంధం కలుపుతారో, ఏవైపు తానున్నానని హింట్ ఇస్తారో కూడా తెలుసుకోవడానికి అంతా వేయి కళ్ళను సిద్ధం చేసుకుంటున్నారు. అమిత్ షా రాజకీయం ఆయనదైతే బీజేపీని నిలువునా వ్యతిరేకించే కమ్యూనిస్టుల రాజకీయం వారిది. అమిత్ షా తిరుపతి టూర్ విషయంలో ఇప్పటికే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిప్పులు చెరుగుతున్నారు. అసలు తిరుపతితో మీకేం పని అమిత్ షా అంటూ గట్టిగానే సౌండ్ చేస్తున్నారు. నాడు ప్రధాని అభ్యర్ధిగా తిరుపతి వచ్చిన మోడీ ప్రత్యేక హోదాను ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఏడేళ్ళు గడిపేశారని, విభజన హామీలన్నీ తుంగలోకి తొక్కారని నారాయణ మండిపడ్డారు.

అలాంటి తిరుపతికి ఏ ముఖం పెట్టుకుని అమిత్ షా వస్తున్నారు అంటూ నిలదీస్తున్నారు. అమిత్ షా ఊరకే వచ్చి వెళ్లిపోతే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తున్నారు. ఏపీకి ఆయన న్యాయం చేయాల్సిందే అంటున్నారు. అమిత్ షా రాక సందర్భంగా నల్ల జెండాలతో సీపీఐ నిరసన ప్రదర్శన నిర్వహిస్తుందని ఆయన చెబుతున్నారు. అదే టైమ్ లో ఏపీకి రావాల్సిన వాటి మీద జగన్ అమిత్ షా ని నిలదీయాలని కూడా కోరుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో చంద్రబాబు సీఎం గా ఉండగా అమిత్ షా కుటుంబ సమేతంగా తిరుపతి టూర్ చేస్తే నాడు టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారని చెబుతారు. ఇపుడు మరోమారు తిరుపతికి ఆయన వస్తూంటే బీజేపీ నేతల నల్ల జెండాల పోరు ఎదురయ్యేలా ఉంది. మొత్తానికి అదేంటో కానీ అమిత్ షాకూ తిరుపతికీ మధ్యన ఈ ఉద్యమాలు, ఉద్రేకాలు మాత్రం ఎపుడూ తప్పడంలేదు. మరి దేశానికే హోం మంత్రి అయిన అమిత్ షా ఈసారి తిరుపతి టూర్ ఎలా సాగుతుందో ఏమేమి సంచలనాలు నమోదు చెసుకుంటాయో వేచి చూడాల్సిందే.