Begin typing your search above and press return to search.

జనసేన అధికార ప్రతినిధి సీపీఐ రామకృష్ణ!

By:  Tupaki Desk   |   2 April 2018 1:33 PM GMT
జనసేన అధికార ప్రతినిధి సీపీఐ రామకృష్ణ!
X
అదేమిటి.. పవన్ కల్యాణ్ ఇప్పటిదాకా జనసేన తరఫున తనొక్కడే తప్ప మరొకరిని ప్రొజెక్ట్ కానివ్వడం లేదు కదా! కనీసం పార్టీలో తాను తప్ప - ముఖ్యమైన మరొక తలకాయ ఉన్నదని ప్రజలు గుర్తించేలాగా పార్టీ కమిటీని కూడా వేయలేదు కదా..! మరి ఈ అధికార ప్రతినిధి ఎక్కడినుంచి పుట్టుకొచ్చినట్లు? అని ప్రజలకు సందేహాలు కలగవచ్చు. ఆయన నియామకం గురించి అధికారిక ప్రకటన అంటూ ఏమీ లేదు గానీ.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాత్రం.. అచ్చంగా జనసేనకు అధికారప్రతినిధి లాగానే మాట్లాడుతున్నారు. తగుదునమ్మా అంటూ ప్రతి విషయాన్నీ తానే వెల్లడి చేస్తున్నారు.

ఈ నెల 5 వతేదీన పార్లమెంటు ముగియబోతున్నది. ఇప్పటిదాకా పార్లమెంటు ఎదుట ఉన్న గాంధీ బొమ్మ వద్ద ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేయడం మినహా మరో కార్యచరణ అంటూ లేని తెలుగుదేశం ఏం చేస్తుందో తెలియదు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయడంతో పాటు - ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటున్నారు. ఆ రకంగా వారు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారం ఆశిస్తున్న మూడో పార్టీ జనసేన ఏం చేయబోతున్నది? ఇప్పటిదాకా ఎలాంటి ప్రణాళిక లేని - ప్రకటించని ఈ పార్టీ తాముగా ఏమీ చెప్పడం లేదు గానీ.. వారి కూటమి 5 వ తేదీన బ్లాక్ డేగా పాటిస్తుందిట. ఇళ్లలో దీపాలు ఆర్పేయాలని ప్రజలకు పిలుపు ఇస్తోంది. ఈ విషయాన్ని జనసేన తరఫున కూడా కలిపేసుకుంటూ.. సీపీఐ రామకృష్ణ వెల్లడించారు.

కొన్ని రోజులుగా పరిణామాలు - ప్రకటనలు చూస్తోంటే.. జనసేన గురించి ఆ పార్టీ నేతల కంటె ఎక్కువగా సీపీఐ కార్యదర్శి రామకృష్ణే మాట్లాడుతున్నట్లు - సంగతులు వెల్లడిచేస్తున్నట్లు కనిపిస్తోంది. జనసేన - వామపక్ష పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నట్లుగా ఆయన రెండు రోజుల కిందటే వెల్లడించారు. పవన్ ఇలాంటి పొత్తులు - కూటముల గురించి ఇప్పటిదాకా చెప్పలేదు. అలాగని తాను కొత్త స్నేహం చూపిస్తున్న రామకృష్ణ ఇలా చెప్పిన తర్వాత.. కనీసం ఆ పార్టీ తరఫున ఎవ్వరూ ఖండించను కూడా లేదు. ఇంకా పొత్తులు-కూటముల విషయంలో తాము నిర్ణయం తీసుకోలేదనే ప్రకటన కూడా లేదు. జనసేన ను సైడ్ లైన్ చేసి రామకృష్ణ చెప్పారేమిటా? అనుకుంటూ ఉంటే.. తాజాగా బ్లాక్ డే పాటించడం గురించి.. జనసేన వామపక్షాలు కలిసి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా మళ్లీ ఆయనే వెల్లడించారు. జనసేన నుంచి మాత్రం ప్రకటన లేదు.

చూడబోతే జనసేన కూటమికి సీపీఐ రామకృష్ణ అధికార ప్రతినిధి లా ఉన్నాడని జనం నవ్వుకుంటున్నారు.