Begin typing your search above and press return to search.

బాబు..ద‌మ్ముంటే వెంక‌య్య‌ను సన్మానించు!

By:  Tupaki Desk   |   4 Oct 2016 9:52 AM GMT
బాబు..ద‌మ్ముంటే వెంక‌య్య‌ను సన్మానించు!
X
సీపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మ‌రోమారు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు - కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడుపై విరుచుకుపడ్డారు. ప్ర‌చారం యావ‌తో ఇద్ద‌రు నేత‌లు ఏపీకి ద్రోహం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. సీపీఐ స‌మావేశంలో రామ‌కృష్ణ‌ మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్‌కు మోసం చేశారని, మాయమాటలతో ఆరుకోట్ల ఆంధ్రులకు బీజేపీ-టీడీపీలు అన్యాయం చేస్తున్నాయ‌న్నారు. యూపీఏ ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ప్రకటిస్తే బీజేపీ నాయకుడు వెంకయ్య నాయుడు పార్లమెంటులో10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరారని రామ‌కృష్ణ గుర్తు చేశారు. 28 మాసాలు అనంతరం మాటమార్చి కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు ప్రత్యేక ప్యాకేజి సాధించామని సన్మానాలు చేయించుకుంటున్నారని విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజి ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు దమ్ముంటే వెంకయ్య నాయుడును సన్మానం చేయమని సవాల్ విసిరారు. ప్యాకేజీతో న్యాయం జ‌ర‌గ‌ద‌ని తెలిసినా ఇద్దరు నాయుళ్లు ఆంధ్రప్రదేశ్‌ కు అన్యాయం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

2లక్షల 20వేల కోట్ల రూపాయలు అరుణ్ జెట్లీ ప్రత్యేక ఫ్యాకేజిగా ప్రకటించారని చెప్పుకొస్తున్న వెంకయ్య నాయుడు దేనికెంతో కూడా వివరించలేని ప‌రిస్థితిలో ఉన్నార‌ని రామ‌కృష్ణ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తే 95శాతం అనుకూలంగా వచ్చాయన్నారు. మ‌రోవైపు రాష్ట్రంలోని ప్ర‌జానికాన్ని మోసం చేసే చ‌ర్య‌ల‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంద‌ని రామకృష్ణ ఆరోపించారు. పోర్టు భూములను సమీకరించి పెట్టుబడి దారులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని విమ‌ర్శించారు.రాష్ట్ర వ్యాప్తంగా భూ సమీకరణ చేసి బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టాలన్న ముఖ్య ఉద్దేశంతోనే పని చేస్తుందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే నల్ల ధనాన్ని వెలికి తీస్తామని చెప్పి గద్దెనెక్కిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా - నరేంద్ర మోడి కనీసం లక్ష రూపాయల నల్లధనాన్ని కూడా వెలికి తీయలేదని రామ‌కృష్ణ‌ ధ్వజమెత్తారు. కోట్లాది రూపాయ‌ల నల్లడబ్బు విదేశాలలో మూలుగుతోందని, రూ.30లక్షల కోట్లు నల్లడబ్బు భారదేశంలో మూల్గుతున్నా కనీసం లక్ష రూపాయలు కూడా నల్లధానాన్ని వెలికితీయలేదని నరేంద్ర మోడిపై మండిపడ్డారు. నల్లధనం విషయంలో నరేంద్ర మోడి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/