Begin typing your search above and press return to search.

ఏపీలో ప్ర‌త్యేక రాష్ట్ర పోరాటం ఖాయం

By:  Tupaki Desk   |   19 Jun 2017 6:02 AM GMT
ఏపీలో ప్ర‌త్యేక రాష్ట్ర పోరాటం ఖాయం
X
ఒకేచోట అభివృద్ధిని కేంద్రీక‌రించ‌డం అనే ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తీరుపై ప‌లు విమ‌ర్శ‌లు ఉన్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌ ను తానే అభివృద్ధి చేశాన‌నే బాబు...రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని ఇప్ప‌టికీ అనేక‌మందిలో అభిప్రాయం ఉంది. ఏపీలో ప్ర‌స్తుత ప‌రిణామాలు ఇలాగే ఉన్నాయ‌ని కొంద‌రు అంటున్నారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఒక‌డుగు ముందుకు వేసి ఇదే విష‌యంలో బాబు హెచ్చరిక‌లు జారీ చేశారు. రాజధాని అమరావతిలోనే అభివృద్ధిని కేంద్రీకరిస్తే ప్రత్యేక తెలంగాణ మాదిరిగా రాష్ట్రంలో మరో ఉద్యమం ఊపిరి పోసుకోవడం ఖాయమని ఆయ‌న హెచ్చ‌రించారు. వెనుకబడిన జిల్లాలపై కూడా ప్రభుత్వం దృష్టిని సారించాలని హితవు పలికారు.

రాజధాని ప్రాంతంలో ఇప్పటికే రైతుల నుంచి సమీకరించిన 34వేల ఎకరాల్లో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ తప్ప మరో నిర్మాణం జరగలేదని రామకృష్ణ అన్నారు. రాజధాని నిర్మాణానికి మరో 31వేల ఎకరాల అటవీ భూమి అవసరమవుతుందని కేంద్రాన్ని కోరిన ప్రభుత్వం, రింగ్‌ రోడ్డు నిర్మాణం - ఇంకా ఏవేవో ప్రాజెక్టుల‌ను పేరు చెప్పి మరో 14వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించాలని నిర్ణయించటం సరికాదన్నారు. కేంద్రం కూడా చంద్రబాబు కోరినంత అటవీ భూమిని ఇవ్వకూడదన్నారు. అభివృద్ధికి ఏమేరకు అవసరమవుతుందో అంతే ఇవ్వాలని సూచించారు. రాజధాని ప్రాంతంలో రైతులిచ్చిన భూమిని పెట్టుబడిగా మార్చి పెట్టుబడిదారీ విధానాన్ని తీసుకొచ్చే యత్నాలను అడ్డుకుంటామన్నారు. ఈ విషయమై అందరినీ కలుపుకుని ప్రత్యక్ష ఆందోళనకు సమాయత్తమవుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాయలసీమ కరవు ప్రాంతాల్లో రైతులను ఆదుకోవాలని వామపక్షాలు చేసిన పోరాటానికి విజయం లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌ పుట్ సబ్సిడీలు - పంటల బీమాను అందజేయాలని నిర్ణయించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్స్‌ లు అమలుచేయాలని, కరవు ప్రాంతాల్లో పంట రుణాలను మాఫీ చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా జూలై 24 నుంచి 26వరకూ ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే విశాఖ భూముల కేసును సీబీఐతో దర్యాప్తు చేయించేందుకు కేంద్రాన్ని కోరాలని రామకృష్ణ కోరారు.

రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతూ శాస్త్రాన్ని అపహాస్యం చేస్తూ వ్యవసాయ శాస్తవ్రేత్తలను కించపరుస్తున్న సుభాష్ పాలేకర్ సారథ్యంలో విశ్వవిద్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం ముందుకురావటం దారుణమని రామ‌కృష్ణ అన్నారు. లక్షలాది కోట్లు ఖర్చుపెట్టి అనేక సంవత్సరాలపాటు పరిశోధనలు చేసి కొత్త వంగడాలు - ఎరువులు - క్రిమిసంహారక మందులను శాస్తవ్రేత్తలు ఆవిష్కరిస్తుంటే అందుకు భిన్నంగా ఆవుపేడ, మూత్రంతో ప్రకృతి వ్యవసాయం చేస్తామంటూ మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తుంటే ఇక శాస్తవ్రేత్తలు ఎందుకని రామ‌కృష్ణ‌ ప్రశ్నించారు. ప్రకృతి వ్యవసాయాభివృద్ధికోసం 100 ఎకరాలు కేటాయించడమే కాకుండా రూ.100 కోట్ల నిధులను సమకూరుస్తామని సీఎం ప్రకటించడం దారుణమని రామ‌కృష్ణ మండిప‌డ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/