Begin typing your search above and press return to search.

యాగం ఏంది? ఈ విశ్లేష‌ణ‌లేందిరా బాబు?

By:  Tupaki Desk   |   2 Aug 2017 4:44 AM GMT
యాగం ఏంది? ఈ విశ్లేష‌ణ‌లేందిరా బాబు?
X
ప్ర‌త్య‌ర్థిని దెబ్బ తీయాలంటే నేరుగా తిట్టేయ‌టం ఒక ప‌ద్ధ‌తి. లేదంటే.. చిత్ర‌విచిత్ర‌మైన పుకార్ల‌ను షికార్లు చేస్తూ.. వాటిని న‌మ్మించే వాద‌న‌ల్ని తెర మీద‌కు తీసుకొచ్చేయ‌టం మ‌రో ప‌ద్ధ‌తి. జ‌గ‌న్ లాంటి బ‌ల‌మైన నేత‌ను దెబ్బ తీయ‌టానికి మొద‌టి నుంచి ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే.

ల‌క్ష కోట్ల అవినీతి ల‌క్ష కోట్ల అవినీతి అని చెప్ప‌ట‌మే కానీ ఇప్ప‌టివ‌ర‌కూ అందుకు సంబంధించిన లెక్క‌ను చూపించింది లేదు. అవినీతి బూచిని చూపించి నానా హ‌డావుడి చేసిన వైనం ఇప్పుడిప్పుడే అంద‌రికి అర్థ‌మ‌వుతుంది. మొన్న‌టికి మొన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌ల్నే తీసుకుంటే.. నేత‌ల ఫిరాయింపుల మీద.. ఓటుకు కేసును ప్ర‌స్తావించి అడిగిన ప్ర‌శ్న‌కు చెప్పిందేమంటే.. ఎవ‌రు మాత్రం చేయ‌టం లేదు? దొరికితే దొంగ‌లు.. దొర‌క్కుంటే దొర‌లు.. దాని గురించి మాట్లాడాల్సిన అవ‌స‌ర‌మే లేద‌న్న‌ట్లుగా తేల్చేశారు.

మ‌రి.. జ‌న‌సేనాధ్య‌క్షుడి మాట‌ల్నే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే.. జ‌గ‌న్ మీద అవినీతి ఆరోప‌ణ‌ల మీద కూడా ఇదే తీరులో ఎందుకు రియాక్ట్ కారు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించ‌దు. ఆరోప‌ణ‌లు ఏ రాజ‌కీయ నాయ‌కుడి మీద‌నైనా కామ‌నే అని.. అవి ప్రూవ్ అయ్యాక నింద‌లు వేయ‌టం బాగుంటుంద‌ని ప‌వ‌న్‌ ఎందుకు చెప్ప‌రు?

బాబు విష‌యంలో ఒక‌లా.. జ‌గ‌న్ విష‌యంలో ఒక‌లా మాట్లాడ‌టం ప‌వ‌న్‌ కు కొత్తేం కాదు. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు కొత్త త‌ర‌హా దాడి చేసే ప్ర‌య‌త్నానికి తెర తీస్తున్న‌రు జ‌గ‌న్ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు. ఆయ‌న శ్రీ మ‌హారుద్ర స‌హిత స‌హ‌స్ర చండీయాగం చేస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. నేత‌లు యాగం చేయ‌టం మామూలే అయినా.. జ‌గ‌న్ చేయిస్తున్న తాజా యాగం స్పెషాలిటీ వేర‌ని.. అది 2019 ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కూ సాగుతుందంటూ ప్ర‌చారం చేస్తున్నారు. అలా ఎలా చెబుతారు? అంటే.. ఈ యాగానికి జ‌గ‌న్ స‌న్నిహితుడు.. పార్టీ అధికార ప్ర‌తినిధి భూమాన క‌రుణాక‌ర్ రెడ్డి హాజ‌ర‌య్యార‌ని చెబుతున్నారు. భూమాన హాజ‌రైతే.. అది జ‌గ‌న్ చేసిన‌ట్లా? అన్న త‌ర్క‌బ‌ద్ధ‌మైన ప్ర‌శ్న వేసుకోకుండా వార్త‌ల మీద వార్త‌లు అచ్చేయ‌టం ఈ మ‌ధ్య‌న ఒక అల‌వాటుగా మారింది.

ఏదైనా ప‌ని చేస్తున్నార‌న్న‌ప్పుడు.. ఆ ప‌ని చేస్తున్న‌ట్లు ఆధారాలు చూపించి అంటే బాగుంటుంది. కానీ.. స‌ద‌రు నేత స‌న్నిహితుడు అక్క‌డ ఉన్నాడు కాబ‌ట్టి.. ఆ చేసే ప‌ని అధినేత చేస్తున్న‌ట్లేన‌న్న‌ట్లుగా చేస్తున్న విష ప్ర‌చారం జ‌గ‌న్ విష‌యంలోనే క‌నిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీ సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ మ‌రో చిత్ర‌మైన వాద‌న‌కు తెర తీశారు. క్రైస్త‌వుడు అయిన జ‌గ‌న్ యాగాలు.. హోమాలు చేయించ‌టం ఏమిటి? అని ప్ర‌శ్నిస్తూనే.. పొత్తు కోసం బీజేపీ వారిని తృప్తి ప‌ర్చ‌టానికే ఈ యాగాలు చేయిస్తున్నారంటూ మండిప‌డుతున్న తీరు చూస్తే.. మోకాలికి బోడిగుండుకు లింకు పెట్ట‌టం ఎలానో ఈ ఎపిసోడ్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. ఇప్ప‌టికే త‌మ తీరుతో ప్ర‌జ‌ల్లో విశ్వాసం కోల్పోయిన క‌మ్యూనిస్టు నేత‌లు ఇలా అర్థంప‌ర్థం లేని వాద‌న‌లు వినిపిస్తూ.. మ‌రింత దూరం కావ‌టం ఖాయ‌మ‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.