Begin typing your search above and press return to search.

మోడీతో ఢీ కొట్టు పవన్... ?

By:  Tupaki Desk   |   10 Oct 2021 8:47 AM GMT
మోడీతో ఢీ కొట్టు పవన్... ?
X
పవన్ కళ్యాణ్ జనసేనానిగా ఆవేశంతో ఊగిపోతారు. ఆయన ప్రసంగాలు చూస్తే నిలువెత్తు పౌరుషానికి ప్రతిరూపం అన్నట్లుగానే కనిపిస్తారు. అయితే పవన్ కోపం అంతా ఏపీ సీఎం జగన్ మీదనేనా అన్న చర్చ అయితే చాలా కాలంగా సాగుతోంది. ఎందుకంటే పవన్ 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు జమానాలో ఎపుడూ ఇలా వీరావేశం నాటి సర్కార్ మీద ప్రదర్శించలేదని వైసీపీ నేతలు అంటారు. ఇక జగన్ సర్కార్ మీద నల్లేరు మీద బండిలా జోరు చూపించే పవన్ అదే సమయంలో తెలంగాణా సీఎం కేసీయార్ ని పల్లెత్తు మాట అనరు అన్న విమర్శలు ఉన్నాయి. దానికి తాజాగా తెలంగాణాలో జనసేనాని నిర్వహించిన పార్టీ మీటింగే ఉదాహరణ అంటున్నారు. ఆ మీటింగులో కూడా పవన్ ఆంధ్రా పాలకులనే బాగా తలచుకున్నారు. ఏపీలో వారి దాష్టికాలు పెరిగాయని కూడా విమర్శించారు. అదే టైమ్ లో తెలంగాణాలో ఏడేళ్ళుగా ఏలుతున్న కేసీయార్ పాలన మీద ఒక్క మాట అనలేకపోయారు అన్న ఆరోపణలు ఉన్నాయి.

సరే పవన్ చూపు అంతా కూడా ఏపీ మీదనే అది కూడా జగన్ మీదనే ఉంది అన్నది అందరూ అంటారు. ఇవన్నీ పక్కన పెడితే జనసేనానికి మాజీ మిత్రుడు అయిన సీపీఐ రామక్రిష్ణ మరో పరీక్ష పెట్టాడు. పవన్ ది పోరాడే పార్టీ అయితే, ప్రశ్నించే తత్వం ఆయనకు ఉంటే ఏపీకి తీరని అన్యాయం చేస్తున్న మోడీని నిలదీయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీని పల్లెత్తు మాట పవన్ అనకపోవడం దారుణమని రామక్రిష్ణ అన్నారు. పైగా పవన్ బీజేపీకి బద్వేల్ లో మద్దతు ఇవ్వడమేంటని ఆయన గుస్సా అయ్యారు. తాను అన్న మాటకు, చెప్పిన సిద్ధాంతానికి ఎక్కడా పొంతన‌ లేదని కూడా ఆయన నిందించడం విశేషం. బద్వేల్ లో సానుభూతితో తాము పోటీ పెట్టమని చెప్పి రెండు రోజులు తిరగకుండానే బీజేపీకి మద్దతు ఇవ్వడం తగునా పవన్ అని రామ‌క్రిష్ణ నిలదీస్తున్నారు.

మొత్తానికి 2019 ఎన్నికల్లో పవన్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సీపీఐ నేత ఇపుడు ఆయన మీద గట్టిగానే సెటైర్లు వేస్తున్నారు. పవన్ కి బీజేపీ పెద్దల వద్ద పలుకుబడి ఉంటే ఆయన దానిని ఏపీ ప్రయోజనాల కోసం వాడాలని కూడా కోరుతున్నారు. పవన్ అందరి మాదిరిగానే విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు ఇస్తే మాత్రం జనం ఎవరూ నమ్మరని కూడా తేల్చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రైతు, కార్మిక వ్యతిరేక పార్టీగా ఉన్న బీజేపీతో మిత్ర బంధాన్ని పవన్ తెంచుకోవాలని కూడా రామక్రిష్ణ డిమాండ్ చేయడం విశేషం. మొత్తానికి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పవన్ బీజేపీ మధ్య దూరం పెరుగుతుందని టీడీపీ వామపక్షాలు సహా అంతా ఎదురు చూశారు. అయితే బద్వేల్ ఉప ఎన్నికల వేళ వారికే మా మద్దతు అంటూ జనసేన ప్రకటించడంతో ఎర్రన్నలకు ముందు కోపం వచ్చింది. ఈ పరిణామాల పట్ల టీడీపీ కూడా గుస్సా అవుతోంది అంటున్నారు. చూడాలి మరి తమ్ముళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో.