Begin typing your search above and press return to search.

ఇక.. హరిబాబుకు తిప్పులు మొదలైనట్లే

By:  Tupaki Desk   |   26 April 2016 10:35 AM GMT
ఇక.. హరిబాబుకు తిప్పులు మొదలైనట్లే
X
కొన్ని సందర్భాల్లో కొంతమంది నేతలు యదాలాపంగా చేసే వ్యాఖ్యలకు విపరీతమైన స్పందన లభిస్తుంది. ఇప్పుడు అలాంటి వ్యాఖ్యే చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కారణంగా విశాఖపట్నం ఎంపీ హరిబాబుకు కొత్త చిక్కులు షురూ అయినట్లేనని చెప్పొచ్చు. ఇంతకాలం ఏపీలో అభివృద్ధి పనులు వేగంగా జరగటం లేదంటూ మిత్రుడైన బాబు సర్కారు మీద బీజేపీ నేతలు విమర్శలు చేయటం తెలిసిందే. కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తుందంటూ మాటలు చెబుతున్నారు. మిత్రుడిపై కత్తి దూయటం ఇష్టం లేని చంద్రబాబు వైఖరి కారణంగా తెలుగు తమ్ముళ్లు మౌనంగా ఉంటుంటే.. విపక్షాలు సైతం ఆశ్చర్యకర రీతిలో స్పందించని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ పరిస్థితికి భిన్నంగా సీపీఐ రామకృష్ణ హరిబాబును తాజాగా టార్గెట్ చేశారు. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ను ఏర్పాటు చేయాలన్న విభజన హామీని రెండేళ్లు అవుతున్నా ఇంకా ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ..రైల్వే జోన్ తీసుకురావటంలో విఫలమైన పక్షంలో అందుకు భాద్యత వహిస్తూ విశాఖ బీజేపీ ఎంపీ హరిబాబు తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

రామకృష్ణ తాజా డిమాండ్ నేపథ్యంలో ఎంపీ హరిబాబుకు ఇక చిక్కులు మొదలైనట్లేనని చెప్పొచ్చు. విభజన చట్టంలో రైల్వే జోన్ ఏర్పాటుకు హామీ ఇచ్చినా దాని గురించి ఎంపీ హరిబాబు ఇప్పటివరకూ ఒక్కసారి గట్టిగా మాట్లాడలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. రామకృష్ణ స్టార్ట్ చేసిన ఎదురుదాడితో విపక్షాలు గొంతు కలిపే అవకాశం ఉన్న నేపథ్యంలో హరిబాబుపై ఒత్తిడి తీవ్రతరం కావటం ఖాయం.