Begin typing your search above and press return to search.

గాలి కూతురు పెళ్లిపై ఐటీ న‌జ‌ర్‌!

By:  Tupaki Desk   |   20 Oct 2016 2:46 PM GMT
గాలి కూతురు పెళ్లిపై ఐటీ న‌జ‌ర్‌!
X
మైనింగ్ బ్యార‌న్ - మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కుమార్తె వివాహం హ‌ల్ చ‌ల్ సృష్టిస్తోంది. వివాహ ప‌త్రికతో అంద‌రి చూపును త‌న‌వైపు తిప్పుకొన్న గాలి జ‌నార్ద‌న్ రెడ్డి అదే స్థాయిలో విమ‌ర్శ‌లు సైతం ఎదుర్కొంటున్నారు. అంగ‌రంగ వైభోగంగా సాగుతున్న గాలి కూతురు వివాహంపై క‌మ్యూనిస్టులు ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. ఇంత మొత్తం సొమ్ములు గాలి జ‌నార్ద‌న్ రెడ్డికి ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయ‌ని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్ర‌శ్నించారు. అందుకే ఈ విష‌యంలో ఆదాయపు ప‌న్ను శాఖా ద‌ర్యాప్తు జ‌రిపి త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

గ‌నుల ద్వారా సంపాదించిన అక్ర‌మ సొమ్మునే గాలి జనార్ద‌న్‌ రెడ్డి ఈ విధంగా ఖ‌ర్చు చేస్తున్నార‌ని రామ‌కృష్ణ మండిప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ - సీఎం సిద్ధ‌రామ‌య్య ఈ విష‌యంపై స్పందించ‌క‌పోవ‌డం చూస్తుంటే గాలితో వారు ఏ విధంగా కుమ్మ‌క్కు అయింది తెలుస్తోంద‌ని వ్యాఖ్యానించారు. ఇదిలాఉండ‌గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రామ‌కృష్ణ మండిప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో ప్రజా హక్కులను హరించే విధంగా పోలీసు పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా ఎన్‌ పీకుంటలో సోలార్ పవర్ ప్లాంట్‌ భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆందోళన చేస్తున్నరైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్ళిన సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు తదితర నాయకులను అక్రమంగా అరెస్టు చేశార‌ని తెలిపారు. కడపలో ఏసీసీ సిమెంట్ భూ నిర్వాసితుల సమస్యలపై ప్రశ్నిస్తారనే అక్కసుతో కడప జిల్లా పార్టీ కార్యదర్శితోపాటు పలువురు నాయకులను గృహ నిర్బంధం చేశారని పేర్కొన్నారు. ప్రశ్నించడమే నేరమన్నట్లుగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని రామ‌కృష్ణ మండిప‌డ్డారు. గతంలో భీమవరం ప్రాంతంలో ఆక్వాఫుడ్ నిర్వాసితుల్ని కూడా ఇదే రకంగా అరెస్ట్ చేసి జైలుకి పంపారని పేర్కొన్నారు. రాష్ట్రంలో భూ నిర్వాసితుల తరఫున ఎవరు మాట్లాడినా అక్రమంగా అరెస్టులు చేసి జైళ్ళకు పంపుతున్న చంద్ర‌బాబు ప్రభుత్వ వైఖరిని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోంద‌ని రామ‌కృష్ణ తెలిపారు. త్వరలోనే ఇతర వామపక్షాలతో కలిసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సమాయత్తమై - ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు పాలనను ఎదిరిస్తామని హెచ్చరిస్తున్నట్లు ఆయ‌న తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/