Begin typing your search above and press return to search.

ఆ బంధం బ‌ల‌ప‌డిన‌ట్టేనా.. హరీష్ రావుకు మ‌ద్ద‌తుగా ఏపీ నేత‌!

By:  Tupaki Desk   |   2 Oct 2022 5:54 AM GMT
ఆ బంధం బ‌ల‌ప‌డిన‌ట్టేనా.. హరీష్ రావుకు మ‌ద్ద‌తుగా ఏపీ నేత‌!
X
ఆంధ్రాలో ప్ర‌భుత్వ టీచ‌ర్లు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రులు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సైతం ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు. త‌మ సంగ‌తి వ‌దిలేసి తెలంగాణ చూసుకోవాల‌ని హ‌రీష్ రావుపై మండిపడ్డారు.

అయితే ఈ వ్య‌వ‌హారంలో ఏపీ సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామకృష్ణ మాత్రం హ‌రీష్ రావుకు మ‌ద్ద‌తుగా నిలిచారు. హ‌రీష్ రావు వ్యాఖ్య‌ల్లో త‌ప్పేమీ లేద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని గుర్తు చేశారు.

ఏపీలో ఉద్యోగులు పడుతున్న సమస్యల గురించి తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యల్లో తప్పేం ఉందని రామకృష్ణ వైసీపీ నేతలను ప్ర‌శ్నించారు. ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై జగన్ సర్కార్ నిరంకుశంగా ప్రవర్తించింది నిజం కాదా అని నిల‌దీశారు. ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన శాంతియుత నిరసనలను పోలీసుతో ఉక్కుపాదం మోపించి జ‌గ‌న్ ప్ర‌భుత్వ అణ‌చివేసింది నిజం కాదా అని రామ‌కృష్ణ ప్ర‌శ్నించారు. సీపీఎస్ ర‌ద్దు, పీఆర్సీ అమ‌లు త‌దిత‌ర అంశాల్లో ఉద్యోగుల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం మోసం చేసింది నిజం కాదా అని రామ‌కృష్ణ వైసీపీ నేత‌ల‌కు వ‌రుస ప్ర‌శ్న‌లు సంధించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధించడం, గృహ నిర్బంధాలు చేయ‌డం, ఉద్యోగుల‌ కుటుంబ సభ్యులను పలు రకాల వేధింపులకు గురి చేయడం నిజం కాదా అని సీపీఐ కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ నిల‌దీశారు. హరీశ్‌రావు ఉన్న విషయం చెబితే వైసీపీ నేత‌లు ఎందుకు ఉలికిప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు.

మ‌రోవైపు టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య బంధం మరింత బలపడుతోందా అంటే అవుననే అంటున్నారు.. విశ్లేష‌కులు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సభలో భాగంగా సీఎం కేసీఆర్ తో కలిసి క‌మ్యూనిస్టు పార్టీ నేత‌లు వేదిక పంచుకున్నారు. అంతేకాకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ, భ‌విష్య‌త్తులోనూ క‌మ్యూనిస్టు పార్టీల‌తో త‌మ పొత్తు కొన‌సాగుతుంద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. క‌మ్యూనిస్టుల‌ను త‌మ‌తో క‌లుపుకు వెళ‌తామ‌న్నారు. ఈ క్ర‌మంలో ఏపీ సీపీఐ కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌లు టీఆర్ఎస్, క‌మ్యూనిస్టు పార్టీల మ‌ధ్య ఉన్న బంధాన్ని చాటిచెప్పాయ‌ని అంటున్నారు.