Begin typing your search above and press return to search.
జనసేనకు 99టీవీ.. దీనివెనుక పెద్ద కథే..
By: Tupaki Desk | 9 Aug 2018 4:44 AM GMTరాజకీయ పార్టీలు-మీడియా సంస్థలు.. ఈ రెండింటికి తెలుగు రాష్ట్రాల్లో విడదీయలేని బంధం ఉంది. పార్టీ బతకాలంటే వారు చేసే పనులు ప్రజల్లోకి వెళ్లాలి.. అలా వెళ్లాలంటే వారి చేతుల్లో ఓ మీడియా ఉండాలి.. 2007 వరకూ తిమ్మిని బమ్మిన చేసిన తెలుగు దేశం అనుకూల ‘ఆ రెండు’ పత్రికలకు దిమ్మదిరిగేలా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘సాక్షి’ పత్రికను తీసుకొచ్చి ప్రజలకు మరోకోణాన్ని కూడా పరిచయం చేశారు.. ఇన్నాళ్లు ప్రజల కళ్లకు తమ రాతలతో గంతలు కడుతున్న పచ్చపత్రికలకు షాక్ ఇచ్చారు..
పార్టీలకు మీడియా అనుబంధం లేకుంటే మనుగడ కష్టం.. ఈ విషయాన్ని తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా గ్రహించారు. అందుకే జనసేన పార్టీ కోసం ఓ మీడియా చానెల్ ను అడాప్ట్ చేసుకున్నారు. ఈ మధ్య జనసేన జనరల్ సెక్రెటరీ తోట చంద్రశేఖర్ సీపీఐ నేతృత్వంలో నడుస్తున్న 99టీవీని కొనుగోలు చేశారు. ఈ చానెల్ ద్వారా తమ జనసేన కార్యకలాపాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. జనసేనకు సపోర్ట్ గా నిలిచే మీడియా జాబితాలో ఇప్పుడు ‘99 టీవీ’ మొదటిస్థానంలో నిలవనుంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 99టీవీని దాదాపు 15 కోట్లకు కొనుగోలు చేసినట్టు జనసేన జనరల్ సెక్రెటరీ తోట చంద్రశేఖర్ వెల్లడించారు. దీనిపై ఏపీ సీపీఐ సెక్రెటరీ రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. కమ్యునిస్టు భావజాలంతో ముందుకెళ్తున్న తమ పార్టీకి ఇలా బిజినెస్ విషయాలను వెల్లడించి తోట ఇరుకునపెట్టాడని.. ఇలా 99టీవీ అమ్మకం విషయాలను బయటపెట్టడం భావ్యం కాదని ఆయన ఫైర్ అయ్యారు.
’‘సీపీఐ -జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనుకుంటున్నాయి.. అంతేకాదు.. మా రెండు పార్టీల మధ్య భావసారూప్యత ఉంది. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో 99టీవీ చాలా నష్టాల్లో ఉంది. దాని మీద సీపీఐ పార్టీ లక్షలు ఖర్చు చేస్తున్నా పరిస్థితి మెరుగుపడడం లేదు. ఎంతో కష్టపడి ఈస్థాయికి తీసుకొచ్చిన చానెల్ ను భారీ నష్టాల కారణంగా మూసివేయాలనుకోలేదు. అందుకే ఈ నష్టాలను తగ్గించుకోవడానికి.. ఉద్యోగులను కాపాడుకోవడానికే 99 టీవీని జనసేనకు అమ్మాం’’ అని సీపీఐ రామకృష్ణ వివరణ ఇచ్చారు.
ఈ అమ్మకం - కొనుగోలు వివాదాలు ఎన్ని వచ్చినా.. మొత్తంగా చూస్తే పవన్ కు ఏపీలో ఉన్న ఆదరణ - పవన్ ఫ్యాన్స్ వల్ల 99టీవీకి క్రేజ్ రావడం ఖాయం.. ఈ ఊపులో 99టీవీ నష్టాలు వీడి లాభాల్లోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. వచ్చే సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున 99 టీవీ కీలక పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు.