Begin typing your search above and press return to search.

ఏపీ సీఎం జగన్‌ నిర్ణయంపై సీపీఐ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   3 Jan 2023 9:40 AM GMT
ఏపీ సీఎం జగన్‌ నిర్ణయంపై సీపీఐ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు!
X
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ లో కందుకూరు, గుంటూరుల్లో జరిగిన సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది.

ఈ నేపథ్యంలో రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ జగన్‌ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కాకరేపుతున్నాయి. ఈ ఉత్తర్వులపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. తమ సభలకు, ర్యాలీలకు పెద్ద ఎత్తున వస్తున్న జనాలను చూసి తట్టుకోలేకే ప్రజల ప్రాణాల పేరుతో ఈ ఉత్తర్వులు తెచ్చిందని మండిపడుతున్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మరోవైపు ఆయన కుమారుడు నారా లోకేష్‌ జనవరి 27 నుంచి 4 వేల కిలోమీటర్ల పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.

అదేవిధంగా సంక్రాంతి తర్వాత జనసేనాని పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంలో బస్సు యాత్ర చేయనున్నారు. ఇప్పటికే లోకేష్‌ పాదయాత్రను అడ్డుకుంటామని వైసీపీ మంత్రులు ప్రకటించారు. అలాగే పవన్‌ కల్యాణ్‌ వాహనానికి అనుమతులు లేవని.. పవన్‌ యాత్రను అనుమతించబోమని ఇప్పటికే గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని వంటి మంత్రులు చెప్పారు.

వైసీపీ నేతల ముందస్తు ప్రకటనలను బట్టి చూస్తే ఉద్దేశపూర్వకంగానే రోడ్లపై సభలు, ర్యాలీలను ప్రభుత్వం నిషేధించిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష నేతల సభలకు, ర్యాలీలకు వెల్లువలా ప్రజలు హాజరవుతుండటంతోనే తట్టుకోలేక సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు తెచ్చారని దుయ్యబడుతున్నారు. జగన్‌ ప్రభుత్వంపై నిర్ణయంపై ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంపై సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. జగన్‌ పాలనలో ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ధ్వజమెత్తారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణాలు చేయడం మానుకుంటారా అని నిలదీశారు. కందుకూరు, గుంటూరు ప్రమాద ఘటనలను సాకుగా చూపించి, జగన్‌ తీసుకుంది నిరంకుశ నిర్ణయం అంటూ రామకృష్ణ నిప్పులు చెరిగారు.

ప్రజల కోసం చేస్తున్న ఉద్యమాలను, ప్రశ్నించే గొంతుకలను, ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలో భాగంగానే జగన్‌ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు తెచ్చిందని సీపీఐ రామకృష్ణ దుయ్యబట్టారు. ప్రత్యేక పరిస్థితుల్లో సభలు పెట్టుకునేందుకు అనుమతిస్తామని చెబుతున్నారని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు మాత్రమే ప్రత్యేక పరిస్థితులు వర్తిస్తాయా అంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రోడ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలని, ఎంపిక చేసుకున్న ప్రదేశాలలో మాత్రమే సభలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. సభ నిర్వహణకు కూడా షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని, షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలలో పేర్కొన్నారు. దీంతో ఏపీలో ప్రతిపక్ష పార్టీల నుండి ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.