Begin typing your search above and press return to search.

జ‌న‌సేన‌తో క‌లిసి మూడో కూట‌మి !

By:  Tupaki Desk   |   13 Jun 2017 5:40 AM GMT
జ‌న‌సేన‌తో క‌లిసి మూడో కూట‌మి !
X
ఏపీ రాజ‌కీయాల్లో ఎన్నిక‌ల మూడ్ వ‌చ్చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న పార్టీ నేత‌ల‌తో ఈ మేర‌కు చేసిన వ్యాఖ్య‌ల ప్ర‌భావ‌మో లేక వ్యూహాత్మ‌కంగా బ‌లోపేతం కావాల‌నే ఎత్తుగ‌డ‌లో కానీ ఆయా పార్టీలు త‌మ ప్రణాళిక‌ల‌ను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో గెలుపు మ‌జాను ఆస్వాదించ‌డంలో వెన‌క‌బ‌డిపోతున్న వామ‌ప‌క్షాల్లో కీల‌క పార్టీ అయిన సీపీఐ ఓ ముంద‌డుగు వేసింది. పొత్తుల‌తో ముందుకువెళ్ల‌డానికి ప్రాధాన్యం ఇస్తూనే తృతీయ కూట‌మి రాగం ఆల‌పిస్తోంది. ఇప్పుడిప్పుడే పార్టీ నిర్మాణ ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టిన జ‌న‌సేన‌తో క‌లిసి న‌డ‌వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

సీపీఐ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి ఇంకా ఎన్నికల ఆలోచన లేదని, అయితే కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు సాగిస్తామన్నారు. జ‌నసేన, కలిసి వచ్చే ఇతర పార్టీలతో కలిసి మూడవ కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటామని ఆయ‌న తెలిపారు. అసెంబ్లీలోని మూడు పార్టీలు ప్రధాని మోడీకి దాసోహం అంటున్నాయన్నారు. ఎన్డీయే పరిపాలన బావుందని, రాష్టప్రతి ఎన్నికల్లో వారి అభ్యర్థికి మద్దతిస్తామని విప‌క్ష నేత వైఎస్ జగన్ ప్రకటించారని, అందుకే మూడవ ప్రత్యామ్నాయం కోసం జనసేన, ఇతర పార్టీలతో కలిసి ముందుకుపోవాలనే నిర్ణయానికి వచ్చామ‌ని రామ‌కృష్ణ తెలిపారు. ఇప్ప‌టికే ప్రాథ‌మిక చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని పేర్కొంటూ త్వ‌ర‌లో పూర్తి స్థాయి కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌న్నారు.

కాగా దేశ‌వ్యాప్తంగా రైతుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంద‌ని రామ‌కృష్ణ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను మోడీ ప్రభుత్వం విస్మరించడంతో రైతుల్లో ఆందోళన చెలరేగుతోందన్నారు. మధ్యప్రదేశ్‌ లో పరిస్థితి కాల్పుల వరకు వెళ్ళి, ఆరుగురు రైతులను ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందన్నారు. ఎన్నికలకు ముందు ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలుచేస్తామని హామీ ఇచ్చిన బిజెపి ప్రభుత్వం దారుణంగా మోసంచేసిందన్నారు. రుణ మాఫీ చేయకుండా వంచించిందన్నారు. కరవు కాటకాలు, తుపాన్లతో నష్టపోయిన రైతులు రుణమాఫీ చేయాలని, కొన్నిచోట్ల గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున ఆందోళనకు దిగుతున్నారన్నారు. తమిళనాడు - రాజస్థాన్ - కర్ణాటక - మహారాష్ట్ర - బీహార్ - మధ్యప్రదేశ్ ఆఖరికి పంజాబ్‌ లో కూడా రైతుల ఆందోళన పెల్లుబుకుతోందని రామకృష్ణ పేర్కొన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌ చార్జి సిద్ధార్థ నాథ్ సింగ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ కు రూ.1.72 లక్షల కోట్లు ఇచ్చామని ప్రకటించారని, అమిత్ షా రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో రూ.1.78 లక్షల కోట్లు ఇచ్చామని చెబుతుంటే, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఏకంగా రూ.2.25 లక్షల కోట్ల నిధులు ఇచ్చామని ప్రకటిస్తున్నారన్నారు. ఇందులో ఏది నిజమో తేలాల్సి వుందని, ఆ నిధులు ఎక్కడెక్కడ, ఏ విధంగా ఖర్చు చేశారో, ఈ లెక్కల్లో వాస్తవమెంతో తేలాల్సివుందని, దీనిని ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సివుందన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేసిన నిధులపై శ్వేత‌పత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నామని రామకృష్ణ పేర్కొన్నారు. విభజన బిల్లు పక్కన పెట్టిన కేంద్రం లక్షల కోట్లు విడుదల చేశామని మోసం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతిరహిత పాలన సాగిస్తున్నామని ఇటీవల నవ నిర్మాణ దీక్షల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్నారని, ఇసుక మాఫియా నుంచి ఉపాధ్యాయుల బదిలీల వరకు అడుగడుగునా అవినీతే జరుగుతోందని రామ‌కృష్ణ‌ ఆరోపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/