Begin typing your search above and press return to search.

ప్రశ్నించలేని పవన్.. కనీసం అడుక్కో

By:  Tupaki Desk   |   2 Aug 2016 10:41 AM GMT
ప్రశ్నించలేని పవన్.. కనీసం అడుక్కో
X
ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంటుగా మారిపోయిన ప్రత్యేక హోదా అంశంపై రగడ రోజు రోజుకూ తీవ్రమవుతోంది. హోదా వల్ల అద్భుతాలేమీ జరిగిపోతాయన్న అంచనాలేమీ లేవు కానీ.. అది ఇవ్వకపోవడం వల్ల వంచనకు గురయ్యామన్న భావనతో బాధ్యులైన వారికి గట్టి గుణపాఠమే చెప్పేలాగున్నారు ఆంధ్ర ప్రజలు. ఈ క్రమంలో అధికార పార్టీలు.. వాటికి మద్దతుగా నిలిచిన వ్యక్తులకు కూడా సెగ గట్టిగానే తగులుతోంది.

నిస్సహాయ స్థితిలో ఉన్న తెలుగు దేశం పార్టీపై వ్యతిరేకతతో పాటు కొంత సానుభూతి కూడా ఉంది కానీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద మాత్రం ఏపీలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గత ఎన్నికల సందర్భంగా ఆ పార్టీకి మద్దతుగా నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. ఇంత జరుగుతున్నా పవన్ మౌనం పాటిస్తుండటం.. ప్రత్యేక హోదా విషయంలో ఏనాడూ గట్టిగా స్వరం వినిపించకపోవడంపై ఏపీ ప్రతిపక్ష పార్టీలు గట్టిగానే దాడి చేస్తున్నాయి.

తాజాగా సీపీఐ కార్యదర్శి రామకృష్ణ పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ ద్రోహిగా మిగిలిపోనున్నాడని.. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ అడుక్కునే స్థితికి దిగజారాడని ఆయన విమర్శించారు. ‘‘ప్రత్యేక హోదా విషయంలో పెదవి విప్పకపోతే పవన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో ఓ ద్రోహిలా మిగిలిపోవడం ఖాయం. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్.. మోడీని అడుక్కునే స్థితికి వచ్చాడు. కనీసం ఆ అడుక్కోవడమైనా చేయాలి’’ అని రామకృష్ణ అన్నారు. చంద్రబాబులాగా మోడీ ప్రభుత్వాన్ని కనీసం వ్యతిరేకించే ప్రయత్నమైనా పవన్ చేయకపోవడం దారుణమని ఆయన విమర్శించారు.