Begin typing your search above and press return to search.

2019 ఎన్నిక‌లే ల‌క్ష్యం..తెర‌పైకి ప‌వ‌న్ ఫ్రంట్‌

By:  Tupaki Desk   |   31 March 2018 1:15 PM GMT
2019 ఎన్నిక‌లే ల‌క్ష్యం..తెర‌పైకి ప‌వ‌న్ ఫ్రంట్‌
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశాన్ని భుజాన వేసుకొని ప్రతి ఒక్క పార్టీ తన రాజకీయ భవిష్యత్‌ను చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ బాటలోనే అడుగులేస్తున్న జనసేన అధినేత పవన్‌ కూడా హోదా ఉద్యమంతోనే ప్రజల్లోకి వెళ్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభతో అధికార పార్టీపై దుమ్మెత్తి పోసిన పవన్‌...హోదా అంశంతో రాజకీయంగా ఎదిగేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. హోదా అంశంతో ప్రజల్లోకి వెళ్లేందుకు పవన్‌ స్థానిక ఉద్యమాల్లో బలంగా పని చేస్తున్న లెఫ్ట్‌ పార్టీ నేతలతో ఇప్పటికే తన ఉద్యమ కార్యచరణ సిద్ధం చేసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారు. హోదా నినాదంతో లెఫ్ట్ పార్టీలతో కలిసి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. హోదా కోసం తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిలిచిన ఆమరణ దీక్ష అస్త్రాన్ని పవన్‌ సంధించబోతున్నట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. అదే స‌మ‌యంలో దీక్ష ఎత్తుగ‌డ‌ను వేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

2019 ఎన్నికలే లక్ష్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తన ప్లాన్‌ను సిద్ధం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా అంశంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఏప్రిల్‌ 4న పవన్‌ విజయవాడలో సమావేశం నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, కడప, ఆంధ్రా రాయలసీమ అంతటా పర్యటించి, బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. చివరగా అనంతపురంలో ఆమరణ దీక్షకు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో తెలుగు ఎంపీలు పార్లమెంట్‌ కేంద్రంగా చేస్తున్న డ్రామాలకు పవన్ బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌నున్నార‌ని అంటున్నారు. హోదా అంశంపై ఏపీలో అధికార, విపక్షాలు చేస్తున్న డ్రామాలను నేరుగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలకంగా ఉన్న ఆమరణ దీక్ష తరహాలోనే ప్రత్యేక హోదా అంశంలో కూడా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే సీనియర్‌ రాజకీయ నాయకులు, మేధావుల సలహాలు, సూచనలు తీసుకున్నట్లు సమాచారం.

మ‌రోవైపు పవన్‌ ఆమరణ దీక్షకు ఇప్పటికే లెఫ్ట్‌ పార్టీ నేతలు మద్దతు ప్రకటించారు. ప్రత్యేక హోదా అంశమే కాకుండా ఇతర అంశాల్లోనూ జనసేనతో కలిసి పని చేయబోతున్నట్లు లెఫ్ట్‌ నేతలు తెలిపారు. అయితే ప్రత్యేక హోదా అంశంపై పలు రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నా ప్రజలు వీరిని నమ్మే పరిస్థితిలో లేరు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలను ఇరకాటంలో పెట్టే ప్రయత్నంలో పవన్‌ ఉన్నట్లు తెలుస్తోంది.


ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్-బీజేపీ-టీడీపీలకు వ్యతిరేకంగా కొత్త రాజకీయవేదికను తీర్చిదిద్దుతున్నట్లు ఏపీ సీపీఎం కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ తెలిపారు. ఏప్రిల్ 5న కేంద్రం ఏపీకి అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించకపోతే ఏపీలో బ్లాక్ డే నిర్వహించనున్నట్టు రామకృష్ణ ప్రకటించారు. తమతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిని చూపితే సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణను ఆహ్వనిస్తామని రామకృష్ణ చెప్పారు. త్వ‌ర‌లో ఈ కూట‌మికి సంబంధించి ప‌వ‌న్ అధికారికంగా వెల్ల‌డిస్తార‌ని సమాచారం.