Begin typing your search above and press return to search.

బాబు మెడ‌కు మ‌త‌కలహాలు !

By:  Tupaki Desk   |   20 Nov 2017 5:31 AM GMT
బాబు మెడ‌కు మ‌త‌కలహాలు !
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మెడ‌కు కొత్త వివాదం చుట్టుకుంది.అందులోనూ వివాదాస్ప‌ద‌మైన మతోన్మాద దాడుల‌కు సంబంధించిన అంశం కావ‌డం గ‌మనార్హం. చిత్రంగా ఆయ‌న‌కు ప్ర‌త్య‌క్షంగా సంబంధం లేని అంశం అయినప్ప‌టికీ...ఆయ‌న భాగ‌స్వామ్య‌ప‌క్షం కాబ‌ట్టి స్పందించాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మిత్ర‌ప‌క్షం కాబ‌ట్టి బాబు ఈ ప్ర‌శ్న‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఇంత‌కీ ఈ డిమాండ్ చేసింది ఎవ‌రంటే సీపీఎం పొలిట్‌ బ్యూరో స‌భ్యురాలు బృందాకార‌త్‌. అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఆవాజ్‌ కమిటీ ఆధ్వర్యంలో 'మైనార్టీల హక్కుల సాధన' అంశంపై బహిరంగ సభలో - అంత‌కుముందు ఏర్పాటుచేసిన విలేక‌రుల స‌మావేశంలో బృందాకారత్ మాట్లాడారు. దేశంలో కొనసాగుతున్న మతోన్మాద దాడులపై ఏపీ సీఎం చంద్రబాబు మౌనం వహించడం సరైందికాదని ఆమె త‌ప్పుప‌ట్టారు.

బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో గో సంరక్షణ పేరిట దాడులు కొనసాగుతున్నాయని బృందాకారత్ అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. కేంద్రాన్ని గ‌ట్టిగా నిల‌దీసే ఏ అంశంలోనూ బాబు స్పందించ‌క‌పోవ‌డం బాధాక‌ర‌మని బృందాకార‌త్ వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ పనుల నిధుల విడుదలలో కేంద్రం జాప్యం చేస్తున్నా సీఎం చంద్రబాబు ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారని, ఈ నిధులపై త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ఢిల్లీలో ఆందోళన చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా, పద్మావతి సినిమా విడుదల కాకమునుపే, కథాంశం ఏమిటో పూర్తిగా తెలియకముందే దాడులు చేస్తున్నారని, ఇది వాక్‌ స్వాతంత్య్రాన్ని హరించడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజల దృష్టిని సమస్యల నుంచి పక్కదోవ పట్టించేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

కేరళ - కర్నాటక - తమిళనాడులో ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని, ఇక్కడ కూడా ఒత్తిడి పెంచి అమలు చేయించుకోవాల్సిన అవసరముందని బృందాకార‌త్ అన్నారు. సచార్‌ కమిటీ - రంగనాథ్‌ మిశ్రా కమిటీలు ముస్లిముల వెనుకబాటు తనంపై స్పష్టంగా చెప్పాయని గుర్తు చేశారు. విలువైన వక్ఫ్‌ ఆస్తులున్నాయని, అవి ముస్లిం సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడిపెంచాలని పిలుపునిచ్చారు.