Begin typing your search above and press return to search.

అప్పటి జిగిరీ దోస్త్ కు పవన్ ఎలా కనిపిస్తున్నాడంటే?

By:  Tupaki Desk   |   5 Dec 2019 8:49 AM GMT
అప్పటి జిగిరీ దోస్త్ కు పవన్ ఎలా కనిపిస్తున్నాడంటే?
X
రాజకీయాల్లో శాశ్విత శత్రువులు.. మిత్రులు ఉండరన్న నానుడి తెలిసిందే. రాజకీయాల్ని మార్చటానికి వచ్చామని చెప్పేటోళ్లు సైతం ఎలా మారిపోతారు? అల్లం కాస్తా బెల్లం కావటం ఎలానో పవన్ ను చూస్తే ఇప్పుడు కామ్రేడ్స్ కు అర్థమైనట్లుంది. కమ్యునిస్టులను అంతా తోక పార్టీగా అభివర్ణిస్తూ పక్కకు పెట్టేసిన వేళ.. జనసేన అధినేత మాత్రం అందుకు భిన్నంగా వారికి దగ్గరగా వెళ్లటం తెలిసిందే.

కాలంతో పాటు మారని సైద్ధాంతిక భావజాలంతో కొన్ని వర్గాలకు.. వయస్కుల వారికి మాత్రమే పరిమితమైన కామ్రేడ్స్ కు పవన్ లాంటి క్రౌడ్ ఫుల్లింగ్ నేత తమతో స్నేహం చేసేందుకు ముందుకు రావటంతో సంబరపడిపోయారు. అయితే.. ఆ సంతోషం ఎక్కువ కాలం సాగలేదు. అదే సమయంలో కమ్యునిస్టులతో పూసుకు రాసుకు తిరిగితే ఎలాంటి ప్రయోజనం లేదన్న విషయం పవన్ కు తక్కువ కాలంలోనే అర్థమైంది. కాలం చెల్లిన సిద్ధాంతాలతో.. ఎంతకూ మారని తత్త్వం తనకు సూట్ కాదని.. పవర్ కు ఎంత త్వరగా దగ్గరకు వెళ్లాలనే లక్ష్యానికి కమ్యునిస్టుల కంటే కమలనాథులే బాగా పనికి వస్తారని జనసేనానికి బాగానే అర్థమైంది.

దీంతో.. పవన్ టోన్ మారింది. ఆ మధ్యన మోడీషాలపై నిప్పులు చెరిగి.. వెంకయ్య అంతోడిని ఎంతమాట పడితే అంత మాట అనేసిన పవన్.. ఇప్పుడు విషయాన్ని అర్థం చేసుకొని తన మాటల్ని మార్చేశారు. శ్రీమాన్ అమిత్ షా లాంటోడే దేశానికి కావాలంటూ కీర్తించేసిన పవన్ తన తదుపరి అడుగులు ఎలా ఉండనున్నాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.

ఏదో రాజకీయాల్లోకి వచ్చాడు.. సినిమా గ్లామర్ తో తమ కమ్యూనిస్టు బ్యాక్ గ్రౌండ్ తో ఏమైనా మంచి రోజులు వస్తాయనుకున్న కామ్రేడ్స్ కు పవన్ తాజా ధోరణి అస్సలు నచ్చటం లేదు. మొన్నామధ్య వరకూ పూసుకురాసుకు తిరిగిన పవన్ మీద అంతెత్తు ఎగిరి పడుతున్నారు వామపక్ష నేతలు. పలు నిరసనలకు పవన్ తో భుజం కదిపి.. రోడ్ల మీద అపసోపాలు పడుతూ నడిచిన సీపీఎం మధు లాంటోళ్లు అయితే పవన్ లోని కొత్త యాంగిల్స్ ను బయటపెడుతున్నారు.

రాజకీయ అవకాశవాదం కారణంగానే పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు మధు. అమిత్ షా లాంటోడు దేశానికి కావాలని చేసిన పవన్ వ్యాఖ్యను తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకువ చర్యలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన జనసేనాని.. ఇలాంటి పాపపు మాటలు మాట్లాడతారా? అంటూ గుండెలు బాదేసుకున్నంత పని చేశారు.

బీజేపీ విషయంలో పవన్ తీసుకున్న వైఖరిని ఆ పార్టీకి ఆత్మహత్యాసదృశ్యమని మరో కమ్యునిస్టు నేత వి.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మొన్నటి వరకూ పవన్ కు జిగిరీ దోస్తులుగా ఉన్న కమ్యునిస్టులు జనసేనానిని విమర్శిస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకాలం పవన్ లోని ఫ్రెండ్ ను చూసిన కమ్యునిస్టులకు రానున్న రోజుల్లో రాజకీయ ప్రత్యర్థిని చూడాల్సి ఉంటుంది. మరి కమ్యునిస్టులు తనపై చేసిన వ్యాఖ్యలకు పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.