Begin typing your search above and press return to search.

కామ్రేడ్స్‌కు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఓకే ఎలా?

By:  Tupaki Desk   |   8 April 2018 9:11 AM GMT
కామ్రేడ్స్‌కు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఓకే ఎలా?
X
వెత‌క‌పోయిన తీగ కాలికి త‌గిలితే ఎలా ఉంటుంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిస్థితి ఇంచుమించు ఇలానే ఉంది. జాతీయ స్థాయిలో ఫ్రంట్ మాట‌లు చెప్పిన ఆయ‌న గ‌డిచిన కొద్దిరోజులుగా కామ్ గా ఉంటున్నారు. కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే దాన‌ర్థం ఆయ‌న ఆ విష‌యాన్ని వ‌దిలేసిన‌ట్లు కాదు.. అంత‌కు మించిన కార‌ణం మ‌రొక‌టి ఉండి ఉంటుంది.

కేసీఆర్ లాంటోడు ప‌ని క‌ట్టుకొని ప్రైవేటు ఫ్లైట్ వేసుకొని మ‌రీ కోల్ క‌తాకు వెళ్లి ప‌శ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాను క‌లిసిన నాలుగు రోజుల‌కే.. ఆమె కాంగ్రెస్ వ‌ర్గాల‌తో భేటీ కావ‌టం కేసీఆర్ వ‌ర‌కూ పెద్ద ఎదురుదెబ్బే. బీజేపీ.. కాంగ్రెసేత‌ర కూట‌మి ఏర్పాటు చేయ‌ట‌మే త‌న ల‌క్ష్యంగా చెబుతున్న కేసీఆర్.. త‌న మాదిరి మైండ్ సెట్ ఉంటుంద‌ని భావించిన మ‌మ‌తా అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించి షాకివ్వ‌టంతో కేసీఆర్ ఫీలైన‌ట్లు చెబుతారు.

మ‌మ‌తా బెన‌ర్జీ త‌ర్వాత మ‌రికొన్ని రాష్ట్రాల్లో ప‌ర్య‌టించాల‌నుకున్న కేసీఆర్‌.. ఢిల్లీలో భారీ బ‌హిరంగ స‌భ‌కు సైతం ప్లాన్ చేశారు. వాట‌న్నింటిని దీదీ దెబ్బ‌కు కేసీఆర్ పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. మొద‌ట్లో త‌న మాట‌ల‌తో తెలంగాణలో మాదిరి ఫ్లాట్ అవుతార‌న్న అంచ‌నా వేసిన కేసీఆర్ కు దీదీ దెబ్బ‌కు రియాలిటీలోకి రావ‌టంతో పాటు.. ఆచితూచి అన్న‌ట్లుగా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న విష‌యాన్ని కేసీఆర్ గుర్తించిన‌ట్లుగా స‌మాచారం.

జాతీయ స్థాయి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో భాగ‌స్వాముల ఎంపిక తాను అనుకున్నంత ఈజీ కాద‌న్న విష‌యాన్ని గుర్తించిన కేసీఆర్‌.. స‌రైన మిత్రులు వంక దృష్టి సారించిన‌ట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా క‌మ్యూనిస్టుల అవ‌స‌రం ఉంద‌న్న భావ‌న‌లోకి వ‌చ్చిన‌ట్లుగా చెబుతారు.

చ‌ట్ట‌స‌భ‌ల్లో వామ‌ప‌క్షాల‌కు బ‌లం లేకున్నా.. జాతీయ‌స్థాయిలో ఏదైనా భావ‌న‌కు వారు ప్ర‌భావితం చేయ‌గ‌లుగుతార‌ని.. వారిపై ఆ విశ్వాసం ఉంద‌న్న‌ది కేసీఆర్ గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. వామ‌ప‌క్షాల‌కు మీడియా స‌ర్కిల్స్ లోనూ బ‌ల‌మైన మూలాలు ఉండ‌టంతో త‌న ఫ్రంట్ లో వామ‌ప‌క్షాల భాగ‌స్వామ్యం ఎంత కీల‌క‌మో కేసీఆర్ కు అర్థ‌మైంది. ఇదే.. నాలుగేళ్లుగా తాను అపాయింట్ మెంట్ ఇవ్వ‌ని కామ్రేడ్స్ కు.. ఈసారి కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వ‌ట‌మే కాదు.. యాభై నిమిషాల పాటు వారితో మాట్లాడారు.

ఇంత‌కాలం త‌మ‌ను ప‌ట్టించుకోని కేసీఆర్‌.. అందుకు భిన్నంగా మ‌ర్యాద‌గా వ్య‌వ‌హ‌రించ‌టంతో పాటు.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌కు సంబంధించి తాను ఏమ‌నుకుంటున్న‌ది చెప్ప‌టం.. త్వ‌ర‌లోనే జాతీయ వామ‌ప‌క్ష నేత‌ల‌తో తాను భేటీ కావాల‌న్న సందేశాన్ని త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన నేత‌ల ద్వారా పంపార‌ని చెప్పాలి. నాలుగేళ్లుగా త‌మ‌కు అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు ఇష్ట‌ప‌డ‌ని కేసీఆర్ ఈసారి అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం.. తిరిగి వెళ్లే స‌మ‌యంలో కారు వ‌ర‌కూ వ‌చ్చి సాగ‌నంప‌టం ద్వారా క‌మ్యూనిస్ట్ ల మ‌న‌సుల్ని దోచుకున్నారు.

నాలుగేళ్లుగా క‌నీసం అపాయింట్ మెంట్ ఇవ్వ‌టం లేదంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న క‌మ్యునిస్టులు కేసీఆర్ తీరుకు ఎందుకు స‌ర్దుకు పోయారంటే.. ఒక బ‌ల‌మైన ముఖ్య‌మంత్రి త‌మ‌తో దోస్తానాకు సంకేతాలు ఇస్తున్న‌ప్పుడు కాద‌న‌లేని ప‌రిస్థితుల్లో వారుండ‌ట‌మే. మొత్తంగా ఎవ‌రికి వారు.. వారి వారి అవ‌స‌రాల కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాలుగా తాజా ప‌రిణామాల్ని చెప్ప‌క త‌ప్ప‌దు.