Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై వామపక్షాల సెటైర్ అదిరింది

By:  Tupaki Desk   |   6 Oct 2016 11:18 AM GMT
చంద్రబాబుపై వామపక్షాల సెటైర్ అదిరింది
X
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. దళిత - గిరిజన - బలహీన వర్గాలకు చంద్రబాబు సర్కారు తీవ్ర న‌ష్టం కలిగిస్తోందంటూ ఆయన మండిపడ్డారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి పాలనలో రాష్ట్రంలో అగ్రకులాలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని ఆయన వెటకారమాడారు. ద‌ళితులు - బడుగులకు ఇంత‌గా అన్యాయం జ‌రుగుతోంటే ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి - యనమల రామకృష్ణుడు - రావెల కిషోర్ బాబు వాటిపై ఎందుకు స్పందించ‌డం లేద‌ని ఆయ‌న అడిగారు. ఈ అంశంపై తాము చంద్ర‌బాబుకి లేఖ రాశామ‌ని, అయినా త‌మ‌కు స‌మాధానం రాలేద‌ని ఆయ‌న అన్నారు.

మరోవైపు వామపక్షాల నేతలు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఆందోళన బాట పట్టారు. విభ‌జ‌న త‌రువాత ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొంటున్న రాయ‌ల‌సీమ ప్రాంతంపై ప్రభుత్వం దృష్టిపెట్టాల‌ని డిమాండ్ చేస్తూ తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద వామ‌ప‌క్షాల నేత‌లు దీక్ష‌కు దిగారు. రాయ‌ల‌సీమ‌కు రూ.50 వేల కోట్ల ప్యాకేజీ ప్ర‌క‌టించాలన్న డిమాండ్ తో చేపట్టిన ఈ దీక్షలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు మాట్లాడుతూ కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చట్టంలో పేర్కొన్న అంశాల‌ను నెర‌వేర్చాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని అన్నారు. కేంద్రం ఇస్తామ‌ని చెబుతోన్న‌ జిల్లాకు ఏడాదికి రూ.50 కోట్ల ముష్టిని తాము అంగీక‌రించ‌బోమ‌ని వ్యాఖ్యానించారు. రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రకు చెరో రూ.50 వేల కోట్లు ఇవ్వాల్సిందేన‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

కాగా ఏపీలో పరిస్థితులపై మొదట్లో ఆందోళనలు చేసినా క్రమంగా నీరుగారిన వామపక్షాల నేతలు మళ్లీ మాటల దాడి పెంచడం - ధర్నాలు - దీక్షలకు దిగుతుండడం చూస్తుండే చంద్రబాబు ప్రభుత్వంపై దండెత్తడానికి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే.. ఇది పురపాలక ఎన్నికల నేపథ్యంలో ఉనికి చాటుకోవడానికే పరిమితమా లేదంటే ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతున్నారా అన్నది తేలాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/